తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిందని చెబుతున్న మిషన్ కాకతీయపై మొదట్లో ప్రశంసలు బాగానే వచ్చాయి. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అనీ, తెలంగాణ రైతుల స్థితిని గతిని మార్చే పథకం అని ఎవరికి తోచిన స్థాయిలో వారు అభినందించేశారు. అదే ఊపులో కేసీఆర్, హరీష్ రావులు ఘనంగా ప్రకటన్లు ఇచ్చేశారు, ప్రారంభోత్సవాలు చేసేశారు. అయితే గత నాలుగైదు రోజులనుండి మాత్రం మిషన్ కాకతీయపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కావాల్సినంత అవినీతి కలిగిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది మిషన్ కాకతీయే అని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడటం, విషయానికి అనుగునంగా కౌంటర్ ఇవ్వలేకో ఏమో కానీ కేటీఆర్ నోరుజారడం తెలిసిన విషయమే. అయితే తాజాగా... పేదలకు, రైతులకు ఉపయోగపడాల్సిన మిషన్ కాకతీయ ను కమీషన్ల కాకతీయ పథకంగా మార్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. జిల్లాల్లో చెరువుల నీటిని విద్యుత్ మోటార్‌తో బయటకు తోడుతుండడం చూసిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ... నీరులేని చెరువుల పనులను ముందుగా చేపట్టాలి తప్ప, ఉన్న నీటిని మూగజీవాలకు దొరక్కుండా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ పాలన రజాకార్లను మరిపిస్తోందన్న నాగం... రైతులు, మత్స్యకారులపై దౌర్జన్యం చేసి చెరువుల్లో నీటిని తోడేయడం సరి కాదని విమర్శించారు. ఏది ఏమైనా... మిషన్ కాకతీయ విషయంలో గతంలో ఊహించింది వేరు ప్రస్తుతం చూస్తుంది వేరు అనే విమర్శ బాగా వినిపిస్తుంది!