నాగం కారెక్కుతారా?

Update: 2016-05-15 05:52 GMT
 కొద్ది రోజులుగా బీజేపీతో అంతటీముట్టనట్లుగా ఉంటున్న ఆ పార్టీ నేత - మాజీమంత్రి నాగం జనార్థన్‌ రెడ్డి రాజకీయ వ్యూహమేంటి? ఆయన ఎటువైపు అడుగులేస్తారు? ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కొద్ది కాలంగా లైమ్ లైట్లో లేనప్పటికీ నాగం జనార్దన రెడ్డి అంటే తెలంగాణలో ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయాల్లో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా ప్రస్తుతం ఆయన ఉన్న బీజేపీలో మాత్రం ఏమాత్రం గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారట. అయితే... విడిచి వచ్చేసిన టీడీపీలోకి వెళ్లాలా? లేదంటే కాంగ్రెస్ పంచన చేరాలా? లేకుంటే అందరూ వెళ్లి చేరుతున్న టీఆరెస్ నే తానూ ఆశ్రయించాలా అన్న డైలమాలో ఉన్న నాగం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఆయనకు,  మద్దతుదారులకు కూడా టీఆరెస్ లో చేరాలన్న ఆలోచన బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. అక్కడ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో నాయకులు అన్ని పార్టీల నుంచి వచ్చి చేరుతుండడంతో తనకు గుర్తింపు ఉంటుందా లేదా అన్న సందేహం ఆయన్ను పట్టి పీడిస్తోందట. స్పష్టమైన హామీ లభిస్తే టీఆరెస్ లోకి వెళ్లడానికి ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

నిజానికి నాగం బీజేపీని వీడుతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా అది మరింత పెరిగింది. అయితే, ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరగ్గా రీసెంటుగా నాగం దాన్ని ఖండించారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పారు. దీంతో ఆయన మనసు టీఆరెస్ వైపు ఉందన్న వాదన వినిపిస్తోంది.  విభజనకు ముందు టీడీపీ నుంచి బయటకు వచ్చేసిన నాగం గత ఎన్నికల ముందు బీజేపీ వైపు వెళ్లారు.  ఆ పార్టీ తలోదారి అన్నట్లుగా ఉండడంతో అక్కడ నాగంను పట్టించుకునేవారే లేకపోయారు. బలం లేకపోయినా వర్గాలు ఎక్కువగా ఉన్న తెలంగాణ బీజేపీలో నాగం ఇమడలేకపోయారు. దీంతో చాలాకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో కానీ, మీడియాలో కానీ కనిపించడం మానేశారు.  తాజాగా మళ్లీ తన రాజకీయ జీవితానికి ఒక దారి అవసరం అన్న ఉద్దేశంతో ఆయన పార్టీ మారాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు అన్నీ ఆలోచించి చివరకు టీఆరెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

అయితే.. నాగం - టీఆరెస్ మధ్య ఇంకా సంప్రదింపులు మొదలు కానప్పటికీ నాగం నుంచి సంకేతాలు అందుతుండడంతో త్వరలోనే టీఆరెస్ వర్గాలు ఆయన్ను కలుస్తాయని భావిస్తున్నారు. కొద్దిరోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News