జ‌గ‌న్ తో నాగార్జున - పొలిటిక‌ల్ హీట్‌!

Update: 2019-02-19 12:07 GMT
ప్ర‌ముఖ న‌టుడు, మ‌న్మ‌థుడుగా తెలుగు మ‌హిళ‌ల మ‌న‌సు దోచిన నాగార్జున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తున్నారా? ఎన్నిక‌ల హ‌డావుడి తారాస్థాయికి చేరుకుంటున్న స‌మ‌యంలో నాగార్జున ఎందుకు జ‌గ‌న్ ను క‌లిశారు వంటి ప్ర‌శ్న‌లు అంద‌రిని ఆత్రుత‌కు గురిచేస్తున్నాయి.

సుమారు అర‌గంట పాటు నాగార్జున‌తో జ‌గ‌న్ ముచ్చ‌టించారు. స‌మావేశం ముగిశాక బ‌య‌ట‌కు వ‌చ్చిన నాగార్జున మీడియాతో మాట్లాడ‌కుండానే వెళ్లిపోయారు. ప‌ల‌క‌రించినా ఆగ‌కుండా వెళ్లిపోయారు. అయితే, నాగార్జున ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా? లేక ఎవ‌రికయినా సీటు అడ‌గ‌డానికి వ‌చ్చారా? అన్న‌ది క‌చ్చిత‌మైన‌ సమాచారం లేదు. కాక‌పోతే ఒక పారిశ్రామిక వేత్త కోసం జ‌గ‌న్ సీటు అడుగుతున్నార‌ని కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి.

సినిమాల నుంచి దాదాపు రిటైర‌యిన నాగార్జున ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని అంటున్నారు. గుంటూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాగార్జున‌ను నిల‌బెడితే గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌భావాన్ని త‌గ్గించొచ్చ‌ని అంటున్నారు. ఈసారి జ‌య‌దేవ్ ఎమ్మెల్యే సీటు అడుగుతున్నారు. తెలుగుదేశం మ‌ళ్లీ అధికారం చేప‌డితే మంత్రి ప‌ద‌వి పొంద‌వ‌చ్చ‌న్న‌ది గ‌ల్లా ఆలోచ‌న‌. వారి ఆలోచ‌న అలా ఉండ‌గా... గుంటూరులో ఇటీవ‌ల వైసీపీ బాగా బ‌ల‌ప‌డిన నేప‌థ్యంలో నాగార్జున వంటి అభ్య‌ర్థి ఉంటే మూడు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావితం చేయొచ్చ‌ని పార్టీ ఆలోచ‌న అని కూడా అంటున్నారు.

ఇదిలా ఉండ‌గా... ముందు నుంచి వైఎస్ కుటుంబంతో నాగార్జున స‌న్నిహిత సంబంధాలు నెర‌పుతున్నారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌ తో ఆ బంధం కొన‌సాగుతోంది. తెలంగాణ వ‌చ్చాక కేసీఆర్ కుటుంబంతో కూడా నాగార్జున మంచి సంబంధాలు నెర‌పుతున్నారు. కేటీఆర్ తో నాగార్జున నిత్యం ట‌చ్‌లో ఉంటారు. ఇపుడు ఈ రెండు పార్టీలు స్నేహ‌బంధంలో ఉన్న నేప‌థ్యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా బాగుంటుంద‌ని నాగార్జున భావిస్తున్న‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  
    

Tags:    

Similar News