రాజీనామా చేసి సీఎంకే షాకిచ్చారు

Update: 2016-12-22 13:21 GMT
ఢిల్లీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ రాష్ట్ర లెఫ్టెనెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న నజీవ్ జంగ్ తన పదవికి రాజీనామా చేశారు. గడిచిన కొద్దిరోజులుగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు.. గవర్నర్ జంగ్ కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అయితే.. ఇలాంటి చికాకులకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో.. తన పదవీ కాలం మరో ఏడాదిన్నర ఉన్నప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేయటం గమనార్హం.

ఐఏఎస్ అధికారి అయిన నజీబ్ జంగ్ విద్యా రంగంలో సేవలు అందించారు. జామియామిలియాఇస్లామియా విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సులర్ గా పని చేసిన ఆయన.. తర్వాతి పరిణామాలతో ఆయన ఢిల్లీ రాష్ట్ర లెఫ్టెనెంట్ గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. ముఖ్యమంత్రికి ఆయనకు మధ్య విభేదాలు పొడచూపాయి.  దీంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

ఉన్నట్లుండి జంగ్ రాజీనామా వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే పలు వర్గాల్లో విస్మయం వ్యక్తమైంది. ఇక.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే.. ఆశ్చర్యానికి గురయ్యారు. జంగ్ రాజీనామా తనను ఆశ్చర్యానికి గురి చేసిందని.. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేశారు. మరోవైపు.. జంగ్ తన రాజీనామా చేసిన అనంతరం.. తన పదవీ కాలంలో ఢిల్లీ ప్రజలు ఎంతో సహకరించారని.. రాష్ట్రపతి పాలన సమయంలో తనపై అపారమైన ప్రేమాభిమానాలు చూపిన ప్రజలతో పాటు ప్రధాని.. ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసిన జంగ్.. మళ్లీ యూనివర్సిటీలో పాఠాలు చెప్పే అవకాశం ఉందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News