సొంత పత్రికకు సగం పేజీ.. ఆ పత్రికలకు అంతలా ప్రకటనలా?

Update: 2020-10-31 16:40 GMT
ఆసక్తికర అంశంగా చెప్పాలి. గతానికి భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయపార్టీలకే నేరుగా సొంత మీడియా సంస్థలు ఉండటం తెలిసిందే. వాస్తవానికి ఈ ట్రెండ్ తమిళనాడులో ఎప్పుడో ఉంది. వారితో పోలిస్తే.. మన దగ్గర కాస్త లేట్ గా మొదలైందని చెప్పాలి. కొన్ని ప్రధాన పార్టీలకు సొంత మీడియా సంస్థలు లేకున్నా.. వారికి దన్నుగా నిలుస్తారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ విషయాల్ని పక్కన పెడితే.. ఈ రోజు వార్తా పత్రికల్ని చూసినప్పుడు ఆసక్తికర కోణం ఒకటి కనిపించింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేసిన పథకాల్లో రైతు వేదిక ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికల్ని నిర్మించి.. రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక రైతు వేదికను ఏర్పాటు చేయటం ద్వారా.. రైతులు తరచూ ఎదుర్కొనే సమస్యలు.. ఇబ్బందుల్ని అధికారులకు చేరవేయటం.. వారి సమస్యల్ని పరిష్కరించేందుకు అవకాశాన్ని కల్పించేందుకు ఈ వేదికల్ని ఏర్పాటు చేస్తున్నారు.

జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వాటికి అయితే ప్రభుత్వం కానీ.. పార్టీ కానీ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తారు. అధికారపార్టీకి సొంత మీడియా సంస్థ ఉన్నప్పుడు వరుసలో తమ మీడియా సంస్థకు ప్రాధాన్యత ఇచ్చుకోవటం.. మిగిలిన వాటికితర్వాత అన్నట్లు ఉంటాయి. విచిత్రం ఏమంటే.. టీఆర్ఎస్ అధినేత సొంత మీడియా సంస్థ అయిన నమస్తే తెలంగాణ మొదటి పేజీలో సగం పేజీ ప్రకటనకే పరిమితమయ్యారు. అదే సమయంలో.. ఈనాడులో ఫుల్ పేజీ యాడ్.. ఆంధ్రజ్యోతిలోనూ పై నుంచి కింద వరకు యాడ్ ఒకటి ఇచ్చారు. సొంత మీడియా సంస్థలో తక్కువగా.. పోటీ పత్రికల్లో ఎక్కువగా వచ్చిన యాడ్ ఇప్పుడు సదరు మీడియా సంస్థల్లోనూ.. పార్టీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తున్నట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News