నందిని సిధారెడ్డికి షాకిచ్చిన ఏఎస్ ఐ

Update: 2017-12-17 04:46 GMT
నందిని సిధారెడ్డి పేరు విన్న వెంట‌నే తెలంగాణ ప్రాంతంలో ఎవ‌రైనా స‌రే ఇట్టే అలెర్ట్ అయిపోతారు. ఎందుకిలా అంటే.. ఆయ‌న సాహిత్య అకాడ‌మీ ఛైర్మ‌న్ కావ‌టంతో కాదు.. చిన్న‌త‌నం నుంచి కేసీఆర్‌ కు అత్యంత ఆఫ్తుడు కావ‌ట‌మే. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌సంగంలో ఒక‌టికి నాలుగుసార్లు ప్ర‌స్తావించిన పేర్ల‌లో నందిని సిధారెడ్డి ఒక‌రు.

అంత‌టి ఫేమ‌స్ అయిన సిధారెడ్డికి ఊహించిన షాక్ త‌గిలింది. మ‌హా స‌భ‌ల్లో భాగంగా తెలుగు విశ్వ‌విద్యాల‌యానికి వ‌చ్చారు నందిని సిధారెడ్డి. భోజ‌నాలు జ‌రుగుతున్న ప్రాంతంలో వెళుతున్న ఆయ‌న్ను అక్క‌డున్న ఏఎస్ ఐ నిలిపివేశారు. ఎందుకంటే.. ఆయ‌న మెడ‌లో గుర్తింపు కార్డు లేదు.

నిబంద‌న‌ల ప్ర‌కారం గుర్తింపు కార్డు లేని వారిని భోజ‌నాల ప్రాంతంలోకి అనుమ‌తించ‌కూడ‌దు. దీనికి తోడు స‌ద‌రు అధికారికి నందిని సిధారెడ్డి అవ‌గాహ‌న లేదు. ఊహించ‌ని రీతిలో ఏఎస్ ఐ అడ్డుకోవ‌టంతో త‌న గురించి తాను చెప్పుకోవాల్సి వ‌చ్చింది. న‌న్నెవ‌రో గుర్తు పట్ట‌లేదా?  నేన‌య్యా నందిని సిధారెడ్డిని అని ఆయ‌న స‌ద‌రు ఏఎస్ ఐకి గుర్తు చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆ ఏఎస్ ఐ వెన‌క్కి త‌గ్గ‌కుండా.. పాస్ లేకుండా లోప‌ల‌కు వెళ్ల‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ను గుర్తు చేశారు.

దీంతో.. త‌న స్థాయి గురించి చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. తాను నిత్యం టీవీల్లో క‌నిపిస్తాన‌ని..  అయినా గుర్తు ప‌ట్ట‌లేదా? అన్న ప్ర‌శ్న వేయ‌గా.. తన‌కు తెలీద‌ని.. పాస్ లేకుండా లోప‌ల‌కు వెళ్ల‌కూడ‌ద‌న్న విష‌యాన్ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో అక్క‌డి పెద్ద‌లు సిధా రెడ్డి గురించి చెప్పి.. లోప‌ల‌కు పంపాల‌ని కోర‌టంతో స‌ద‌రు ఏఎస్ఐ ఆయ‌న్ను అనుమ‌తించారు. నిజాయితీగా.. త‌న ధ‌ర్మాన్ని తాను నిర్వ‌ర్తించిన స‌ద‌రు పోలీసు అధికారిని ప‌లువురు అభినందిస్తున్నారు. త‌న‌ను ఏ ప‌ని అయితే చేయ‌మ‌ని చెప్పారో.. ఆప‌నిని నూటికి నూరుపాళ్లు అన్న రీతిలో నిర్వ‌ర్తించిన స‌ద‌రు ఏఎస్ ఐ తీరు అక్క‌డి వారిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అదే స‌మ‌యంలో కొంద‌రు భ‌జ‌న‌ప‌రుల‌కు మాత్రం స‌ద‌రు పోలీసు అధికారిలో ఓవ‌రాక్ష‌న్ క‌నిపించింది.
Tags:    

Similar News