నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ జ‌రిగేదిలా

Update: 2017-08-23 04:59 GMT
నంద్యాల ఉప ఎన్నిక‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించట‌మే కాదు.. ఈ ఎన్నిక ఫ‌లితం ఏపీ రాజ‌కీయాల మీద తీవ్రంగా ఉంటుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగ‌నుంది. తుది ఫ‌లితం మీద అధికార‌.. విపక్షాల మ‌ధ్య భారీ ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ఉప ఎన్నిక అంటే సాదాసీదాగా సాగుతుంద‌న్న మాట‌కు భిన్నంగా నంద్యాల ఉప ఎన్నిక సాగింది.

ఇప్ప‌టివ‌ర‌కూ సాగిన ఉప ఎన్నిక ఎపిసోడ్ లో అత్యంత కీల‌క‌మైన ప‌ర్వం ఈ రోజు మొద‌లు కానుంది. ఈ ఉద‌యం (బుధ‌వారం) ఏడు గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ సాగ‌నుంది. 2లక్షల 18వేల 858 మంది ఓట‌ర్లు త‌మ తీర‌పును ఈవీఎంల‌లో నిక్షిప్తం చేయ‌నున్నారు. బ‌రిలో 15 మంది అభ్య‌ర్థులు నిలిచినా.. పోటీ మాత్రం టీడీపీ అభ్య‌ర్థి భూమా అవినాశ్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన శిల్పా మోహ‌న్ రెడ్డిల మీద‌నే జ‌ర‌గ‌నుంది.

ఉప ఎన్నిక కోసం 255 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంట‌ల్లోపు పోలింగ్ కేంద్రాల క్యూలో నిలుచున్న వారికి ఓటు వేసే అవ‌కాశాన్ని ఇవ్వ‌నున్నారు. అధికార‌.. ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారిన ఈ ఉప ఎన్నిక‌పై ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేక దృష్టి సారించింది.

పోలింగ్‌ను ప‌క‌డ్బందీగా.. నిష్ప‌క్ష‌పాతంగా.. ఎలాంటి విమ్శ‌ల‌కు తావివ్వ‌కుండా ఉండేలా చేసేందుకు క‌ర్నూలు ఎన్నిక‌ల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నిక ప‌రిశీల‌కుడిగా ప‌శ్చిమ బెంగాల్‌ కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి హిమాన్స్ జ్యోతి చౌద‌రిని సాధార‌ణ ప‌రిశీల‌కుడిగా నియ‌మించ‌టం గ‌మ‌నార్హం. ఒక ఉప ఎన్నిక‌కు ఎన్నిక క‌మిష‌న్ ఈ త‌ర‌హాలో ఏర్పాటు చేయ‌టం అరుదుగా చెబుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ లో మ‌రో విశేషం ఏమిటంటే.. తొలిసారి వీవీ ప్యాట్ ఈవీఎంల‌ను వినియోగించ‌నున్నారు. వీటి ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఓట‌ర్లు తాము వేసిన ఓటు ఏ గుర్తుకు ప‌డింద‌న్న విష‌యాన్ని 7 సెక‌న్ల పాటు చూసుకునే వీలు ఉంది. ఈ స‌మాచారం ఓటు వేసిన ఓట‌రుకు త‌ప్ప మ‌రెవ‌రికీ తెలీదు.
Tags:    

Similar News