పురుషులపై జాలి చూపించిన నన్నపనేని..

Update: 2018-05-30 12:54 GMT
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల్లో కూర్రత్వం పెరిగిపోతోందని.. దీనికి టీవీ సీరియళ్లే కారణమని మండిపడ్డారు. డైలీ సీరియల్స్ చూసి స్ఫూర్తి పొంది మహిళలు హత్యలు చేస్తున్నారని.. దీనివల్ల త్వరలోనే పురుష కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు  చేశారు.. విజయవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు.  ఉత్తరాంధ్రలోని విజయనగరంలో భర్తను చంపించిన భార్య ఘటన - శ్రీకాకుళం జిల్లాలో భర్తపై హత్యాయత్నం వంటి సంఘటనలు విస్తుగొలుపాయని అన్నారు.

ఇటీవల కాలంలో ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకొని కిరాయి గుండాలతో కలిసి మహిళలు తమ భర్తలను హతమారుస్తున్నారని నన్నపనేని సంచలన కామెంట్స్ చేశారు. మహిళలు ఇదే విధంగా దారుణాలకు పాల్పడడం కొన్ని చానల్స్ లో వచ్చే డైలీ సీరియల్స్ ప్రభావమేనని ఆమె అభిప్రాయపడ్డారు. సీరియల్స్ చాలా దారుణంగా ఉంటున్నాయన్నారు.

ప్రస్తుతం తెలుగులో వస్తున్న సీరియళ్లలో మహిళలే విలన్ పాత్రలు పోషిస్తున్నారని.. మహిళలను విలన్ గా చూపించడం తనకు అంతుబట్టడం లేదన్నారు. ఈ సీరియళ్లలో మనుషులను ఎలా చంపాలో కూడా వివరంగా చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే పురుష కమిషన్ కూడా వేయాలని ప్రభుత్వానికి సూచించాలనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News