మారిన చంద్ర‌బాబు వ్యూహం.. పొత్తుల మాటేంటి..?

Update: 2023-01-15 13:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం మారింది. పండ‌గ పూట చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ చ్చే ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని భావిస్తున్న టీడీపీ నేత‌ల‌కు ఈ ప్ర‌క‌ట‌న హుషారు నింపింది. అయితే.. అదేస‌మ‌యంలో రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం సంచ‌ల‌నం రేపింది. ఇంత‌కీ.. చంద్ర‌బాబు ఏమ‌న్నారు? అనేది చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ నేత‌లు అంద‌రూ కూడా 150 స్థానాల్లో విజ‌యం త‌థ్య‌మ‌ని చెబుతున్నారు.

పార్టీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు కూడా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ టార్గెట్ 160 స్థానాలని చెబుతున్నారు. అంటే.. మిగిలిన 15 స్థానాల్లో పార్టీ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అర్ధ‌మ‌వుతోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఫార్ములాకే క‌ట్టుబ‌డిన నాయ‌కులకు.. అనూహ్యంగా  పార్టీ అదినేత చంద్ర‌బాబు షాకిచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 175 స్థానాల‌ను గెలుచుకుని తీరుతామ‌ని..బాబు స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు.. ఈ దిశ‌గా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నం చేయ‌డం కాదు.. క‌ష్ట‌ప‌డాల‌ని.. చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. నిజానికి ఇన్నాళ్ల‌లో చంద్ర‌బాబు నోటి నుంచి ఈ త‌ర‌హా కామెంట్ మాత్రం రాలేదు. తాజా గా వ‌చ్చిన ఈ ప్ర‌క‌ట‌న అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఒక‌వైపు ప‌వ‌న్‌తో జోడీ పెట్టుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. పార్టీ నాయ‌కులు అనుకుంటున్న త‌రుణంలో అనూహ్యంగా ఆయ‌న ఇలా 175 వాద‌న తీసుకురావ‌డం ఆశ్చ‌ర్యంగానే తోస్తోంది.

అంటే.. ఇక్క‌డ బాబు.. వ్యూహం ఏంటి?   జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తుల‌పై దోబూచులాడుతున్నా ర‌నే ఆవేద‌న ఉందా?  లేక‌.. వైసీపీ వేసిన వైనాట్ 175 వ్యూహానికి ప్ర‌తి వ్యూహం వేశారా?  లేక‌.. పార్టీ శ్రేణుల‌ను ఉత్తేజ ప‌రిచేందుకు ఇలా అన్నారా? అనేది కూడా చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఒక‌వేళ చంద్ర‌బాబు క‌నుక 175 టార్గెట్ పెట్టుకుని  ముందుకు సాగాల‌ని అనుకుంటే.. ప్ర‌స్తుతం ఉన్న పొత్తుల చ‌ర్చ‌కు ఇక ఛాన్స్ లేకుండా పోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీని వెనుక ఏముంద‌నేది కొంత వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News