ఇలాంటి నీతులు మీరు చెప్పటమా చినబాబు?

Update: 2019-09-12 07:45 GMT
నీతులు చెప్పొద్దని ఎవరూ చెప్పరు. కానీ.. దానికో అర్హత ఉండాలి. మేం చేయాల్సిన ఛండాలం చేస్తాం.. పక్కనున్నోళ్లు మాత్రం పరమ పవిత్రంగా ఉండాలన్న థియరీ చిరాకు పుట్టటమే కాదు.. చుర్రుమనిపిస్తుంది. తాజాగా మాజీ మంత్రి కమ్ చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ వారి నీతి ముక్తావళి ఎటకారంగానే కాదు.. పలువురు తప్పు పట్టేలా ఉంది.

సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. వెగటు వ్యాఖ్యలు రాయటం టీడీపీకి మొదటి నుంచి అలవాటే. తాజాగా ఎవరో అనామక జగన్ ఫ్యాన్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఖాతాలో చంద్రబాబు ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన వైనంపై లోకేశ్ నీతులు చెప్పుకొచ్చారు.  

తన తండ్రి ఫోటోల్ని మార్ఫింగ్ చేసిన వారిపై తన అక్కసును వెళ్లగక్కుకున్న లోకేశ్.. '@ysjaganగారూ! అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా?' అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు.

చినబాబు మాటల్ని వింటే.. అయ్యో.. ఎంత అన్యాయం జరిగిందనిపించక మానదు. కానీ టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో  జగన్ ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తూ.. దారుణమైన వ్యాఖ్యలు చేసిన గతాన్ని మర్చిపోకూడదు కదా? మార్ఫింగ్ ఉదంతాల్లో అదే పనిగా బుక్ అయిన హిస్టరీ లోకేశ్ సొంతం. అలాంటి ఆయన.. తాజాగా ఎవరో తెలీని వ్యక్తి మార్ఫింగ్ చేస్తే.. దానికి గుండెలు బాదుకోవటంలో అర్థం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. తమ అధికారిక ఖాతాల్లోనే ప్రత్యర్థిని ఉద్దేశించి ఇష్టారాజ్యంగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టినప్పుడు లేని వేదన అంతా.. ఇప్పుడే ఎందుకు వస్తుంది లోకేశా?
Tags:    

Similar News