ఇంటికో ఉద్యోగం... కొత్త నిర్వచనం!

Update: 2016-12-19 04:24 GMT
ఎన్నిక‌ల ముందు ఊకదంపుడు ఉపన్యాసాల్లో భాగంగా వెనకా ముందూ చూసుకోకుండా ప్రజలకు హామీలు ఇస్తారనే విమర్శలు దాదాపు అన్ని పార్టీలపైనా ఉన్న సంగతి తెలిసిందే! అయితే ఇలాంటి హామీలు ఇచ్చేట‌ప్పుడు - వాటిని అమ‌లు చేయ‌డం సాధ్య‌మా కాదా అనే ఆలోచ‌న‌లు ఆయా పార్టీల పెద్దలు ఆలోచిస్తారా? లేక, హామీలు నెరవేర్చని ప్రభుత్వాలను ప్రజలు చేయగలిగేది ఏమీ లేరనే దైర్యం వల్ల నిర్ణయం తీసుకున్నారా? అనే సంగతులు కాసేపు పక్కనపెడితే... ఆ హామీల పుణ్యమాని ఒకసారి అధికారంలోకి వ‌చ్చిన తర్వాత ఆయా హామీల‌కు కొత్త అర్థాలు వెతుకుతూ, ప్రజల జ్ఞానాన్ని కంప్లీట్ గా క్లియర్ చేసే పనికి పూనుకుంటుంటారు. తాజాగా అదే పనిచేశారు తెలుగుదేశం యువనేత నారా లోకేష్.

ఎన్నిక‌ల ముందు ఇంటికో ఉద్యోగం ఇచ్చేస్తామంటూ ప్ర‌క‌టించింది తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి రావడానికి ఈ అంశం కూడా కీలకంగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు దాటిపోయిన తరుణంలో ఆ హామీ గురించి స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు లోకేష్ బాబు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌రిగిన జాబ్ మేళా సందర్భంగా స్పందించిన లోకేష్... త‌మ పార్టీ ఎన్నిక‌ల ప్రణాళిక‌లో "ఇంటికో ఉద్యోగం" అని హమీ ఇచ్చిందంటే దాన‌ర్థం మీరనుకుంటుంది కాదని చెబుతున్నారు! ఇంటికో ఉద్యోగం అంటే అవన్నీ పూర్తిగా ప్ర‌భుత్వం ఉద్యోగాలు మాత్ర‌మే కావ‌ని, ప్రైవేటు ఉద్యోగం అయినా కావొచ్చని తెలిపారు. సరేలే ఏదైనా ఉద్యోగమే కదా అని సరిపెట్టుకుంటున్న వారికి మరింత క్లారిటీగా చెప్పారు లోకేష్. ప్రభుత్వ - ప్రైవేటు ఉద్యోగాలే కాదు.. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా పొందే ఉపాధి అవ‌కాశం కూడా ఇంటికో ఉద్యోగం కావొచ్చ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌డ‌చిన రెండు సంవ‌త్స‌రాలుగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వేసిన పునాదుల వ‌ల్ల ల‌క్ష‌కుపైగా ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని కూడా చెప్పేశారు. అంటే... రాష్ట్రంలో యువ‌త కొత్త‌గా ఏ చిన్న ప‌నిలో చేరినా అది పూర్తిగా తెలుగుదేశం ప్ర‌భుత్వం క‌ల్పించిన ఉద్యోగంగానే భావించాల‌న్న‌మాట‌! ఈ లెక్కన చూసుకుంటే... లక్షకు పైనే ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు, కానీ లోకేష్ బాబు పెద్ద మనసుతో కేవలం లక్ష ఉద్యోగాలే వచ్చాయని చెప్పారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News