వావ్ హైదరాబాద్.. ఎంత దూకుడో చెప్పిన తాజా రిపోర్టు
ఒకప్పుడు హైదరాబాద్ కు కొన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు జీవనోపాధి కోసం వచ్చేవారు.
పదేళ్ల క్రితం హైదరాబాద్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే చెప్పుకునే వారు. అయితే.. మూడు నాలుగేళ్ల నుంచి మాత్రం సీన్ మారింది. హైదరాబాద్ గురించి తెలుగోళ్లు కాదు.. ఇప్పుడు దేశ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. ఒకప్పుడు హైదరాబాద్ కు కొన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు జీవనోపాధి కోసం వచ్చేవారు. ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా దేశంలోని మెజార్టీ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ మహానగరానికి వస్తున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీనికి తగ్గట్లే భాగ్యనగరి వేగంగా విస్తరిస్తోంది.
తాజాగా విడుదలైన నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ‘ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ రిపోర్టు’ ఆసక్తికర అంశాల్ని పేర్కొంది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని.. బెంగళూరు రెండో స్థానంలో ఉన్నట్లుగా వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో ముంబయి.. ఎన్ సీఆర్ ఢిల్లీ.. అహ్మదాబాద్.. చెన్నై ఉన్నట్లుగా పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఆరు నగరాలు తమదైన ప్రత్యేకతల్ని చాటుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా పేర్కొంది.
ఈ ఆరు మహా నగరాలు భారత దేశ సత్వర ఆర్థికాభివ్రద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా పేర్కొంది. మౌలిక సదుపాయాలు.. స్థిరాస్తి రంగ విస్తరణతో పాటు ప్రభుత్వ విధానాలు.. పాలనా.. జనాభా పెరుగుదల ప్రాతిపదికన ఆరు మహానగరాల తీరును ఈ రిపోర్టులో విశ్లేషించారు. గడిచిన పదేళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో 10 శాతం చొప్పున వార్షిక వృద్ధిని నమోదు చేయగా.. 2023లో 11 శాతం వృద్ధిని నమోదైనట్లుగా పేర్కొంది. రవాణా సదుపాయాలు బహుముఖంగా విస్తరించటం హైదరాబాద్ నగర విస్తరణకు.. స్థిరాస్తి రంగం డెవలప్ మెంట్ కు తావిస్తున్నట్లుగా వెల్లడించింది. ఇక.. వాణిజ్య ఆస్తులకు బెంగళూరులో గిరాకీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. విదేశీ పెట్టుబడులను బెంగళూరు నగరం అధికంగా ఆకర్షిస్తోందని పేర్కొంది.