మళ్లీ మంగళగిరి నుండే పోటీ చేసి గెలుస్తా : నారా లోకేష్

Update: 2021-11-27 06:17 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి లో హుషారుగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలను పరామర్శించి వారితో కలిసి వారి సమస్యలని అడిగి తెలుసుకుంటున్నారు.

పట్టణంలో పది మంది చిన్నతరహా వ్యాపారులకు తోపుడుబండ్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాదిరి తాను మాట తప్పనని అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మాదిరి మాట మార్చే ప్రసక్తేలేదన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్ల మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నారా లోకేశ్ విస్తృతంగా పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని.. వాటి గురించి ఆరా తీశారు. అదేవిధంగా ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించారు.

వారికి ధైర్యం చెప్పి.. అండగా నిలుస్తామన్నారు. టిడ్కో ఇళ్లు, పింఛన్ల సమస్యలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలు నారా లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గత ఎన్నికల్లో ఓటమి తరువాత.. ఆయన నియోజకవర్గం మారుస్తున్నారని ప్రచారం జరిగింది. విశాఖపట్నంలోని భీమిలి లేదా నార్త్.. లేదా మామ కంచుకోట హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలు అన్నింటికీ చెక్ పెడుతున్నారు నారా లోకేష్, ఇలా మనసు మారడానికి వేరే కారణం ఉంది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

తన తండ్రి కంచుకోట అనుకునే కుప్పంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత ఆయన మనసు మారినట్టు తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గం నారా ఫ్యామిలీ కంచుకోట అక్కడ ప్రచారానికి వెళ్లినా నారా చంద్రబాబు నాయుడిదే విజయం.. టీడీపీ అధినేతకు అడ్డగా చెప్పుకునే కుప్పంలో ఇటీవల ఫలితాలు లోకేష్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి అంటున్నారు.

అందుకే 2024 ఎన్నికలకు చాలా సమయమే ఉన్నా ఇప్పటి నుంచే తనకు అంటూ ఒక నియోజవర్గం ముందు నుంచి వెతికి పెట్టుకోకపోతే.. నష్టం తప్పదని నిర్ణయానికి వచ్చారు. అయితే కొత్త నియోజకవర్గం వెతుక్కోడం కంటే, గతంలో ఓడిన చోటే నిలబడి,గెలిస్తే గౌరవంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

గతంలో ఎప్పుడు మంగళగిరి వెళ్లినా.. కేవలం కేడర్, పార్టీ నేతలతో మాట్లాడి వెళ్లే వారు.. కానీ ఇప్పుడు నేరుగా సామాన్యులను కలుస్తున్నారు. వారితో కాసేపు మాట్లాడుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలోనే లీడర్లు ఇలాంటి స్టంట్లు చేస్తుంటారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎన్నికలు లేకున్నా,అక్కడి సామన్య ప్రజలతో నిత్యం కలుస్తూనే ఉన్నారు. మొత్తంగా నారా లోకేష్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి లో గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.


Tags:    

Similar News