నిర్మలమ్మ బడ్జెట్ పై మోదీ స్పందన ఏంటంటే?

Update: 2020-02-01 15:43 GMT
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ వరుసగా తన రెండో బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం పార్లమెంటులో నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రంసంగాన్ని సుదీర్ఘంగా కొనసాగించారు. మోదీ సర్కారు ప్రాధాన్యాల మేరకే నిర్మలమ్మ తన బడ్జెట్ కు రూపకల్పన చేశారు. అంతేకాకుండా మోదీ సర్కారు భవిష్యత్తు వ్యూహాలను కూడా ఆమె తన బడ్జెట్ లో చాలా స్పష్టంగానే పేర్కొన్నారు. సరే... మరి నిర్మలమ్మ సుదీర్ఘ కసరత్తుతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏమన్నారన్న విషయం కూడా ఆసక్తికరమే కదా. వివిధ పార్టీ నేతల మాదిరే... మోదీ కూడా తన కేబినెట్ లోని ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించాల్సిందే కదా. అందుకే మోదీ కూడా నిర్మలమ్మ  బడ్జెట్ పై స్పందించారు. మరి ఏమన్నారో... చూద్దాం పదండి.

‘‘నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టాం. ఈ బడ్జెట్ పెట్టుబడులు, ఆదాయం, డిమాండ్‌ను పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. దేశ ప్రజల అవసరాలను, దశాబ్దపు ఆర్థిక అంచనాలను పరిపూర్ణం చేస్తుంది. దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ ద్వారా అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. ఈ దశాబ్దపు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందానికి అభినందనలు. ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, జౌళి పరిశ్రమ, సాంకేతిక రంగాల్లో ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. ఆదాయాన్ని పెంచేందుకు 16 కీలక అంశాలపై దృష్టి సారించాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతాం.

దేశం నుంచి ఎగుమతులు పెంచేందుకు బడ్జెట్‌లో ప్రోత్సహకాలు కల్పించాం. యువతకు ఉపాధి, పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌ విధానాలు, విదేశాలకు వెళ్లే వారి కోసం బ్రిడ్జ్‌ కోర్సులు ప్రవేశపెట్టనున్నాం. నీలి విప్లవంతో మత్స్య పరిశ్రమలో విస్త్రృత అవకాశాలు లభిస్తాయి. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్‌ భారత్‌ కొత్త దశను నిర్దేశిస్తుంది. దేశంలో వైద్య పరికరాల తయారీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్‌లో స్మార్ట్‌సిటీలు, డేటా సెంటర్‌ పార్కులు వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఇక కొత్తగా 100 ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయడం, రవాణా రంగంలో మౌలిక వసతుల కల్పన ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఉద్యోగ కల్పన పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు’’ అని మోదీ పేర్కొన్నారు.
Tags:    

Similar News