అత్తా కోడ‌ళ్లు ఇద్ద‌రూ ఇద్ద‌రే : మోదీ

Update: 2018-05-09 14:23 GMT
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో అక్క‌డ ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మాట‌ల యుద్ధాన్ని తీవ్ర‌త‌రం చేశారు. క‌ర్ణాట‌క‌లో క‌మ‌ల‌వికాస‌మే ప‌ర‌మావ‌ధిగా కొద్ది రోజుల‌గా అక్క‌డే తిష్ట వేసి మ‌రీ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తోన్న ప్ర‌ధాని మోదీ.....ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, సోనియా గాంధీ పై మోదీ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. నెహ్రు నుంచి రాహుల్ వ‌ర‌కు వార‌స‌త్వ రాజ‌కీయాల‌పైనే ఆ కుటుంబం శ్ర‌ద్ధ చూపార‌ని ఎద్దేవా చేశారు. ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండానే....త‌న‌కు ప్ర‌ధాని కావాల‌ని ఉంద‌ని రాహుల్ అన్నార‌ని.....ఆ కుటుంబంలోని వారికి ప్రధాని కుర్చీపై ఆశ ఎక్కువని మండిప‌డ్డారు. ఇంద‌రా గాంధీని, సోనియా గాంధీని క‌న్న‌డ ఓట‌ర్లు గెలిపించార‌ని, అయినా క‌న్న‌డ‌ప్ర‌జ‌ల‌ను వారు ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు. అత్తను మించిన కోడలు సోనియా గాంధీ అని మోదీ దుయ్య‌బ‌ట్టారు.

1978లో ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ కు డిపాజిట్లు ద‌క్క‌లేద‌ని....అటువంటి స‌మ‌యంలో చిక్కమగళూరు నుంచి ఇందిరా గాంధీని క‌న్న‌డిగులు గెలిపించార‌ని మోదీ అన్నారు. ఎంపీగా గెలిచిన ఇందిర క‌ర్ణాట‌క వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని, అటువంటి కాంగ్రెస్ ను క‌న్న‌డ ప్ర‌జ‌లు గెలిపించ‌ర‌ని అన్నారు. అదేవిధంగా 1999లో బళ్లారి సోనియా గెలిచార‌ని, రూ. 3,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించి అడ్ర‌సు లేకుండా పోయారని మండిప‌డ్డారు. సీజేఐ - సీబీఐ - ఎన్ఐఏ  సైన్యం పనితీరుపై కాంగ్రెస్ కు న‌మ్మ‌కం లేద‌ని, త‌మ పార్టీ ఒక్క‌టే నిజాయితీగ‌ల‌ద‌ని వారు భావిస్తున్నార‌ని ఆరోపించారు. ఓట‌మి భ‌యంతోనే ఈవీఎంలపై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేస్తోన్న‌ భారత ఎన్నికల సంఘంపై కూడా అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం దారుణ‌మ‌న్నారు. వ‌క్క‌లు ఆరోగ్యానికి హానికరం అని కాంగ్రెస్ చెప్పింద‌ని, చిక్కమంగళూరు చుట్టుపక్కల జిల్లాల్లోని వక్క చెట్ల పెంపకం రైతుల బాధ‌లు వారికిప‌ట్ట‌వ‌ని మండిప‌డ్డారు. విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు వెద‌జ‌ల్లి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని కాంగ్రెస్ భావిస్తోంద‌ని, చాలా చోట్ల కాంగ్రెస్ కు చెందిన వారి నుంచి అధికారులు భారీ మొత్తంలో న‌గ‌దు, బంగారం స్వాధీనం చేసుకున్నారని మోడీ ఆరోపించారు.

Tags:    

Similar News