వార‌ణాసిని మోడీ అస్స‌లు లైట్ గా తీసుకోవ‌ట్లేదు

Update: 2019-05-17 06:15 GMT
ఆయ‌న మామూలు వ్య‌క్తి కాదు. 56 అంగుళాల ఛాతీ ఉన్న న‌రేంద్ర మోడీ. ఆయ‌న మాట‌కు ఊగిపోయేవారు కోట్లాది మంది ఉంటారు. ప్ర‌ధాన‌మంత్రి కుర్చీలో రెండోసారి కూర్చునేందుకు ఆయ‌న ఎక్క‌డా రాజీ ప‌డ‌టం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశ ప్ర‌ధానిగా ఉన్న వారు ఎన్నిక‌ల వేళ చేయ‌ని వ్యాఖ్య‌లే కాదు..  త‌న తీరుతో జాతీయ స్థాయి చ‌ర్చ‌కు తెర తీసిన ఘ‌నత ఆయ‌న సొంతం.

ఇంత చేస్తున్న ఆయ‌న‌.. మిగిలిన చోట్లను వ‌దిలేస్తే.. తాను పోటీ చేస్తున్న వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం కోసం ప‌డుతున్న క‌ష్టం.. కేటాయిస్తున్న స‌మ‌యం చూస్తే.. ఇంత క‌ష్ట‌ప‌డ‌టం ఏమిటి? అన్న భావ‌న రావ‌టం ఖాయం. దేశాన్ని మార్చేయ‌ట‌మే కాదు.. త‌న హ‌యాంలో స‌రికొత్త భార‌త్ ను ఆవిష్క‌రించిన‌ట్లుగా మాట‌లు చెప్పే మోడీ.. త‌న గెలుపు కోసం వార‌ణాసిలో అంత‌గా ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దా?

దేశ ప్ర‌ధాని స్థానంలో ఉన్న తాను.. దేశం మొత్తం తిరగాల్సి ఉన్న నేప‌థ్యంలో.. ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించ‌లేక‌పోతున్నాన‌న్న మాట‌ను చెప్పే ధైర్యం మోడీ ఎందుకు చేయ‌టం లేదు? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. నామినేష‌న్ వేసే రోజున ప‌లువురు జ‌ర్న‌లిస్టుల‌ను హెలికాఫ్ట‌ర్ ల‌లో తీసుకెళ్లిన తీరు చూస్తే.. ప్ర‌చారం కోసం.. వార‌ణాసిలో త‌న ప‌ట్టు ఎంత‌న్న‌ది ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి ఆయ‌న ప‌డిన తాప‌త్రంగా ఇట్టే క‌నిపించ‌క మాన‌దు.

ఇక‌.. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం  ఆయ‌న ఐదుసార్లు వార‌ణాసిని సంద‌ర్శించారంటే.. ఆయ‌న తాను పోటీ చేస్తున్న స్థానానికి ఇచ్చిన ప్రాధాన్య‌త ఎంతో ఇట్టే అర్థమ‌వుతుంది. కాశీలో మోడీ గెలుపు ప‌క్కా అని.. కాకుంటే 2014లో ఆయ‌న‌కు వ‌చ్చిన బంప‌ర్ మెజార్టీ మీద‌నే సందేహాల‌ని చెబుతున్నారు.  గ‌త ఎన్నిక‌ల్లో మోడీకి 5,61,022 ఓట్లు రాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు 2,09,238 ఓట్లు వ‌చ్చాయి. ఇక‌..కాంగ్రెస్ అభ్య‌ర్థి అజ‌య్ రాయ్ కు 75,614 ఓట్లు.. బీఎస్పీ.. ఎస్పీ అభ్య‌ర్థుల‌కు 1.05 ల‌క్ష‌ల ఓట్లు వ‌చ్చాయి.

తాజా ఎన్నిక‌ల్లో కేజ్రీవాల్ బ‌రిలో లేక‌పోవ‌టంతో పోటీ పెద్ద‌గా లేద‌ని చెప్పాలి. కాకుంటే.. కాంగ్రెస్‌.. ఎస్పీ.. బీఎస్పీల‌కు ఓట్లు భారీగా చీల్చే అవ‌కాశం ఉండ‌టం.. అదే జ‌రిగితే.. గ‌తంలో ప‌డినన్ని ఓట్లు రాని ప‌క్షంలో గెలిచినా ఓడిన‌ట్లే లెక్క‌. ఈ నేప‌థ్యంలో తాను బ‌రిలో ఉన్న వార‌ణాసిలో త‌ర‌చూ ప్ర‌చారం చేయ‌టం ద్వారా సెంటిమెంట్ ను పండించ‌టం.. భావోద్వేగంతో భారీ ఎత్తున ఓట్లు ప‌డేలా చేయాల‌న్న‌దే మోడీ ఆలోచ‌న‌గా చెబుతారు. మ‌రి.. వార‌ణాసి ఓట‌ర్లు మోడీ క‌ష్టానికి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.  


Tags:    

Similar News