ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ ఉగ్రముప్పును ఎదుర్కున్నారా? తృటిలో ఆయన సేఫ్ అయ్యారా? అంటే అవుననే అంటున్నారు కేరళ డీజీపీ సేన్ కుమార్. కేరళలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల ముప్పు నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తృటిలో తప్పించుకున్నారని తాజాగా వెల్లడిస్తూ డీజీపీ సంచలనం రేకెత్తించారు.
ప్రధానమంత్రి కొచ్చీ పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందు కొచ్చీలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ప్రధానమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎస్పీజీ పోలీసులు ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానిక హైకోర్టు సమీపంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో సుమారు 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై విపక్షాలు విరుచుకుపడ్డ నేపథ్యంలో తాజాగా సేన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆందోళనలనకారులను అదుపు చేసే క్రమంలో లాఠీచార్జీ చేయాల్సి వచ్చిందే తప్ప ముందస్తు ప్రణాళిక ఏమీ లేదన్నారు. నిరసనకారులను చర్యల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
కాగా, మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించిన అనంతరం ప్రధాని మెట్రో రైలులో కొంతదూరం ప్రయాణించారు కూడా. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు - కేరళ గవర్నర్ పి సదాశివం - ముఖ్యమంత్రి పినరాయి విజయన్ - కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితల - ఎర్నాకుళం ఎంపి కెవి థామస్ - కొచ్చి మేయర్ సౌమిని జైన్ మెట్రోమ్యాన్ ఇ శ్రీధరన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్రో రైల్లో ప్రయాణించిన అనంతరం ప్రధాని ఒక ట్వీట్ లో ఇది దేశాభివృద్ధికి దోహదపడే ఓ భావితరం మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అని అభివర్ణించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/