మోడీ పబ్లిసిటీ కోసం చేస్తున్నాడా?

Update: 2020-04-03 10:30 GMT
‘‘నీకు ప్రాణం కావాలా? డబ్బు కావాలా?’ అని అడిగితే దేన్ని ఎంపిక చేసుకుంటావ్.. ఖచ్చితంగా ప్రాణమే కావాలి.. బతికుంటే బలిసాకు తిని బతుకొచ్చు’’ అంటారు... కరోనా మహమ్మారి కాచుకు కూర్చున్న వేళ భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ప్రజల ప్రాణాలను కాపాడడానికే దేశంలో లాక్ డౌన్ విధించారు. కానీ ప్రపంచానికి పెద్దన్న - ప్రపంచంలోనే సంపన్న దేశమైన అమెరికా మాత్రం లాక్ డౌన్ విధిస్తే తమ అగ్రరాజ్యం ఆర్థికంగా అధోగతి పాలవుతుందని.. నంబర్ 1 స్థానం  పోతుందని చెప్పి అమెరికన్లను బలిపెట్టడానికి నిర్ణయించుకుంది. అమెరికాకు డబ్బే ముఖ్యం అనుకుంది. అందుకే అక్కడ ప్రాణాలు పోతున్నాయి.. ’’... ఇప్పుడు బీజేపీ వాదులు - మోడీ అభిమానులు చేస్తున్న వాదన ఇదీ..

సరే బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు.. కానీ బతకాలి కదా.. ఆ బతకడం ఎంత దుర్భరమో లాక్ డౌన్ వేళ తెలుస్తోంది. దేశంలో అన్నం లేక ఆకలి చావులు పెరిగిపోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. వలస కూలీలు పట్నం వదిలి వందల కి.మీలు కాలినడక కడుపు చేతపట్టుకొని తిరుగుతున్న వైనంపై సోషల్ మీడియాలో వందల కథనాలు వస్తున్నాయి.వాటిపై స్పందనలేదు. ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కరోనాను జయిస్తాం అని చంకలు గుద్దుకోవడం కరెక్టే.. దాని వల్ల కరోనా తొలిగాక వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా తట్టుకోగలమనేది ఇప్పుడు మేధావులను వేధిస్తున్న ప్రశ్న. దీనిపై మోడీ తన వీడియోల్లో ప్రసంగాల్లో ఎక్కడా మాట్లాడకపోవడమే ఆర్థిక వేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

లాక్ డౌన్ ను ఎలా అమలు పరచాలి? దాని పర్యవసనాలు ఎంత దారుణంగా ఉంటాయనే దానిపై మోడీ ప్రభుత్వం ఎలాంటి సమాలోచనలు జరపలేదన్నది నిపుణుల మాట.. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఆకలిచావులు - ఉద్యోగ - ఉపాధి పెద్ద ఎత్తున కోల్పోవడం.. దారుణ ఆర్థికసంక్షోభం.. తినడానికి తిండి లేని వైనంపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడమే ఇప్పుడు దేశ ప్రజానీకాన్ని ఆవేదనకు గురిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

దేశవ్యాప్త లాక్ డౌన్ సృష్టించిన జీవనాధారాల సంక్షోభం ముందు ప్రజల ఆరోగ్యానికి పట్టిన ‘కరోనా వైరస్’ ముప్పు వెలవెల బోతోందని ప్రజలను చూస్తే అర్థమవుతోందంటున్నారు. లాక్ డౌన్ వల్ల రేషన్ కార్డులు లేని ఎంతోమందికి ఆహారం - ఇతర నిత్యావసరాలు సమకూర్చుతామనే విషయంపై మోడీ సార్ ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలవలేదు. రవాణా వ్యవస్థ కుప్పకూలడంతో మిషిన్లు రాక పంటలు కోయలేక రైతులు వదిలేస్తున్న పరిస్థితి.. పండిన పంటలు కొనే నాథుడే లేకపోవడం.. ఇక రవాణా వ్యవస్థ స్తంభించడంతో సరుకుల సరఫరాకు అంతరాయం ఏర్పడి నిత్యావసరాల కొరత ఏర్పడుతోంది. అక్రమ వ్యాపారాలు పెరిగిపోవడాన్ని ఆపడం లేదు.

కరోనా వైరస్ సోకిన వారిలో మరణించిన వారి సంఖ్య 2శాతం మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్థిక సంక్షోభం.. ఆహార కొరత.. ఉద్యోగాలు కోల్పోయి జీవన విధ్వంసం అంతకంటే భారీగా ఉండనుంది. లక్షలు సంపాదించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. పత్రికలు - పరిశ్రమలు మూతబడడానికి రెడీ అయ్యాయి. మొత్తంగా ఈ లాక్ డౌన్ లో జీవన విధ్వంసమే జరుగుతోంది.

ఇంతటి సంక్షోభ స్థితిలో ప్రధాని మోడీ ప్రజలను ఆదుకునే చర్యలను చేపట్టడం మాని తన పబ్లిసిటీ - పరపతి పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారని తాజాగా వీడియో చూశాక అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.కుదేలైన ఉద్యోగులకు - రైతులకు - ప్రజలకు అందించే సహాయ సహకారాల గురించి ప్రధాని మోడీ మాట్లాడుతున్నదేమీ లేకపోవడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ప్రధాని ప్రసంగంలో జాతికి ఏదైనా ఉపశమనం కలిగించే ఆర్థిక లబ్ధి చేకూర్చే నిర్ణయాలు ప్రకటిస్తారని అందరూ టీవీలకు అతుక్కుపోయారు. కానీ మోడీసార్ రాత్రి దీపాలు పెట్టాలని.. 130 కోట్ల మంది తన వెనుకున్నారని ప్రపంచానికి చాటాలని కోరారు. ప్రపంచదేశాలకు మోడీ ఖ్యాతీ దీంతో ప్రస్ఫుటిస్తుంది. కానీ ఆకలితో అలమటించే జనాలు.. ఆకలిచావులు - ఉద్యోగాలు కోల్పోయిన వారికి, రైతులకు ఈ దీపాలు పెడితే ఏం లాభం చేకూరుస్తుందనేది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్ కోసం మోడీ చేస్తున్న ఈ ప్రయత్నాలను తూలనాడుతున్నారు.

మోడీ దీపాల పెట్టడం కంటే ముఖ్యంగా ఇప్పుడు జనాలకు కోరుకున్నవి నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కరోనాపై ఎవైనా నివారణ చర్యలు చేపట్టాలని..దాన్ని అరికట్టాలని..దేశ ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించాలని.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్యాకేజీలు ఇవ్వాలి.. వచ్చే ఆర్థిక మాంద్యాన్ని ఎలా దాటాలి? వీటిపై మోడీ ఏదైనా చెప్తారని ఆశించారు. కానీ తన సొంత లాభం.. ప్రతిష్ట పేరిట ప్రజలను దీపాలను పెట్టాలని.. సమస్యలను గాలికొదిలేసిన తీరుపై ప్రజల్లోనూ - నెటిజన్లలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. కరోనా తగ్గాక ఏర్పడే జీవన విధ్వంసం ఈ దేశాన్ని ఏం చేస్తుందన్న భయం వెంటాడుతుందని నెటిజన్లు - నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు.... చూడాలి మరీ.

  


Tags:    

Similar News