ప్ర‌తి పౌరుడు సైనికుడే: మ‌న్ కీ బాత్‌ లో ప్ర‌ధాని

Update: 2020-04-26 12:56 GMT
క‌రోనా వైర‌స్‌ పై భార‌త్ పోరాడుతోంద‌ని - ఈ పోరాటంలో ప్ర‌జ‌లే సైనికుడిలా పోరాడుతున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ మ‌హ‌మ్మారిపై ప్రజా పోరాటం జరుగుతుందని తెలిపారు. ప్ర‌తి నెలాఖ‌రులో చివ‌రి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో ప్ర‌ధాన‌మంత్రి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏప్రిల్ చివ‌రి ఆదివారం (ఏప్రిల్ 26) సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి రేడియోలో ప్రసంగించారు. కరోనాపై పోరాటం సరైన దిశలోనే సాగుతుందని చెప్పారు. భార‌త ప్రజలంతా ఒకరికొకరు అండగా నిలబడుతున్నార‌ని, ఈ పోరాటానికి ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్‌పై ప్రతీ పౌరుడు ఒక సైనికుడిలా యుద్ధం చేస్తున్నార‌ని కొనియాడారు.

ఈ సంక్షోభ స‌మ‌యంలో రైతులు నిర్విరామంగా ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. దేశంలో ఎవరూ కూడా ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు రైతులు శ్రమిస్తున్నట్లు వారిని కీర్తించారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. ముఖానికి మాస్క్‌లు ధ‌రించ‌డం మ‌న జీవితాల్లో ఒక భాగంగా మారిపోయిందని పేర్కొన్నారు. మాస్క్‌ లు ధ‌రించిన వారిని రోగులుగా చూడ‌కూడ‌ద‌ని - నాగ‌రిక స‌మాజానికి మాస్క్‌లు చిహ్నంగా మారాయని అభివ‌ర్ణించారు. మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవడానికి - ఇత‌రుల్ని వ్యాధి నుంచి కాపాడడానికి మాస్క్‌ లు ధ‌రించ‌డం ముఖ్యమని గుర్తుచేశారు. లాక్‌డౌన్ సమయంలోనూ రైల్వే ఉద్యోగులు పని చేస్తున్నారని వారికి తన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. బ‌హిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే క‌లిగే అన‌ర్ధాల ప‌ట్ల ప్రజల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని మోదీ అన్నారు. ఇలాంటి అల‌వాటును ఆపాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌న్నారు. కరోనా నివారణను అరిక‌ట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ అద్భుతంగా ఉందంటూ కొనియాడారు.


Tags:    

Similar News