తెలుగోళ్లకు మరో దెబ్బేసిన మోడీ

Update: 2019-08-31 04:19 GMT
తెలుగోళ్లంటే ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యేకమైన అభిమానం. తెలుగు ప్రాంతాల్లో పర్యటించిన ప్రతిసారీ.. తన ఉపన్యాసంలోని ప్రారంభ వ్యాక్యాల్ని తెలుగులో మాట్లాడి మనసును దోచే ప్రయత్నం చేసే ఆయన.. తాను తీసుకునే నిర్ణయాలతో తెలుగోళ్ల మనసుల్ని గాయపరిచేలా చేస్తుంటారన్న విమర్శ ఉంది. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కావొచ్చు.. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల విషయంలో కానీ.. అంశం ఏదైనా కానీ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భిన్నంగా మోడీ మాష్టారి నిర్ణయం ఉంటుందన్న పేరుంది.

దీనికి తగ్గట్లే తాజాగా ప్రభుత్వ బ్యాంకుల్ని విలీన చేసి.. జంబో బ్యాంకుల్ని తయారు చేసే కసరత్తును ప్రకటించటం తెలిసిందే. ఇప్పటివరకూ ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్ని డజనుకు కుదించటం ద్వారా.. భారీ బ్యాంకులుగా మార్చటం అన్న వాదన వినేందుకు ఓకేలా అనిపించినా.. దీనికి వెనుక కారణాలు వేరన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

అన్నింటికి మించి తెలుగు వారికి చెందిన రెండో బ్యాంకును మాయం అయ్యేలా మోడీ ప్రభుత్వ సర్కారు నిర్ణయం ఉందని చెప్పాలి. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయటం ద్వారా.. హైదరాబాద్ బ్యాంకును కనుమరుగు అయ్యేలా చేశారు. తాజాగా ఆంధ్రోళ్ల ఐడెంటిటీ.. ఇంకా చెప్పాలంటే తెలుగువారి ఉనికిని చాటే ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయనున్నట్లుగా ప్రకటించటం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పక తప్పదు.

మోడీ హయాంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ను విలీనం చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మంచి లాభాల్లో ఉన్న ఎస్ బీహెచ్ ను ఎస్ బీఐలో విలీనంపై అప్పట్లో ఆసక్తికర చర్చ నడిచింది. ఇప్పుడు ఆంధ్రా బ్యాంకును కలిపేస్తూ నిర్ణయం తీసుకోవటం ద్వారా.. తెలుగువారికి చెందిన బ్యాంకు అన్నది లేకుండా పోనుంది. తెలుగు వారి ఉనికిని కనిపించకుండా చేస్తున్న మోడీ తీరు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

తెలుగోళ్లపై మోడీకి ఎందుకంత కసి అన్న అక్రోశం పలువురి నోట వినిపిస్తోంది. 96 ఏళ్ల క్రితం ప్రారంభించి.. ఘనమైన చరితకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఆంధ్రా బ్యాంకును చరిత్రలో కలిపేయటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News