ఏపీ పుణ్యమా అని ‘హోదా’నే ఎత్తి పడేస్తారట

Update: 2016-09-03 04:26 GMT
గీతను చిన్నదిగా చేసేందుకు దాని కంటే పెద్ద గీతను గీసే వ్యూహం ఒకటి ఉంటుంది. కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లుగా ఉంది. నిధుల విషయంలో మహా కరకుగా ఉండే మోడీ.. ప్రత్యేక హోదా పేరిట భారీ ఎత్తున నిధుల వరదను ఆయా రాష్ట్రాలకుపారించే ధోరణిపై అసంతృప్తిగా ఉన్నట్లుగా చెబుతారు. ప్రత్యేక హోదా పేరుతో భారీగా నిధులు ఆయా రాష్ట్రాలకు కేటాయించటంపై ఉన్న గుర్రుకు నిదర్శనమే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటంగా చెబుతారు. అయితే.. హోదా ఒక సెంటిమెంట్ గా మారి మోడీ సర్కారుకు చిరాకు పుట్టిస్తున్న వేళ.. ‘ప్రత్యేక హోదా’పై మోడీ మార్క్ నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

హోదా ఇస్తేనే కదా ఇప్పుడున్న ఇబ్బందులన్నీ. అలాంటప్పుడు ప్రత్యేక హోదా అన్నది దేశంలోనే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనను కేంద్రం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక తప్పని పరిస్థితులు ఒక్కొక్కటిగా పెరుగుతున్న వేళ.. అసలు హోదా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేసేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు.

ఏపీకి హోదా ఇస్తే.. దాన్నే తమకూ ఇవ్వాలంటూ బీహార్.. ఒడిశా.. బెంగాల్ రాష్ట్రాలు అడుగుతాయని చెప్పే బీజేపీ నేతల మాటలకు తగ్గట్లే.. అసలు ‘హోదా’ అన్నది లేకుండా చేసేస్తే ఒక తలనొప్పి పోతుందన్న దిశగా ఆలోచనలు స్టార్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. భవిష్యత్తులో ప్రత్యేక హోదా అన్న కాన్సెప్ట్ అన్నదే లేకుండా చేయటమే లక్ష్యంగా పావులు కదపటం ఆసక్తికరంగా మారింది. మరి.. ఇప్పటికే ప్రత్యేక హోదా అమల్లో ఉన్న పదకొండు రాష్ట్రాల మాటేమిటి? వాటినేం చేస్తారు? అన్న ప్రశ్నలకు వినిపిస్తున్న సమాధానం ఆశ్చర్యాన్ని రేకెత్తించేలా ఉంది.

ఇప్పటికే ప్రత్యేక హోదా అమలవుతున్న 11 రాష్ట్రాల్ని ఆ కేటగిరి నుంచి తప్పించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాలకు ఇచ్చే ప్రయోజనాల్ని నిలిపేసి.. ఏ రాష్ట్రానికి అవసరమైన అంశాల మీదనే దృష్టి పెట్టనున్నట్లుగా చెబుతున్నారు. ఇంత భారీ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు? దీనిపై రాజకీయ పక్షాలకు.. రాష్ట్రాలను ఎలా కన్వీన్స్ చేస్తారన్నది ఒక ప్రశ్న. దీనికి సంతృప్తికర సమాధానం చెప్పేందుకు వీలుగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎన్ డీసీ నిర్ణయిస్తుంది. అందులో ప్రధాని.. కేంద్రమంత్రులు.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రణాళికా సంఘం ప్రతినిధులు ఉంటారు. ప్రస్తుతం ఎన్ డీసీనే ఉనికిలో లేనప్పుడు ‘ప్రత్యేక హోదా’ను కొనసాగించటంలో అర్థం లేదన్న వాదనను వినిపించనున్నట్లుగా తెలుస్తోంది. ‘హోదా’ అన్నదే ఎత్తేస్తున్న వేళ.. ఏపీకి ప్రత్యేక హోదా ఎక్కడన్నది కేంద్రం ప్రశ్నగా మారనుందని తెలుస్తోంది. తాము ఇప్పటికే మోసపోయానని భావిస్తున్న ఏపీ ప్రజలు.. హోదా అన్నదే లేకుండా మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంటే.. తమను ఇబ్బంది పెట్టేందుకే మోడీ సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా భావించటం ఖాయం. అదే జరిగితే బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. గీతను చిన్నది చేయటానికి పెద్ద గీత గీసే వ్యూహం అన్నిసార్లు సాధ్యం కాదన్న విషయం మోడీ అండ్ కోకు అర్థం కాదా..?
Tags:    

Similar News