టైమ్స్ నౌదీ అదే మాట‌!... ఈ సారీ మోదీనేన‌ట‌!

Update: 2019-03-12 04:07 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత ప్రీపోల్ స‌ర్వేల పేరిట వెలువ‌డుతున్న స‌ర్వేల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోమారు దేశానికి ప్ర‌ధాని అవుతార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఆరు నెల‌లుగా వివిధ సంస్థ‌లు వెలువ‌రించిన స‌ర్వేల్లో మోదీ హ‌వా త‌గ్గినా... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనే అధికారంలోకి వ‌స్తుంద‌న్న వాద‌న వినిపించినా... ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత ఈ వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరింది. ఇందుకు దోహ‌దం చేసిన కార‌ణాల్లో పుల్వామా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాల‌పై భార‌త వాయుసేన చేసిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌... మోదీ మేనియాను అమాంతంగా పెంచేశాయ‌ని తాజాగా వ‌చ్చిన స‌ర్వే వెల్ల‌డించింది. మ‌ళ్లీ మోదీనే అంటూ టైమ్స్ నౌ సంస్థ విడుద‌ల చేసిన ప్రీపోల్ స‌ర్వే తేల్చిచెప్పింది. టైమ్స్ నౌ- వీఎంఆర్ పోల్స్ స‌ర్వేలో ఈ విష‌యం వెల్ల‌డైంది.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ మోదీ హ‌వాను ఎంత‌గా పెంచాయ‌న్న విష‌యాన్ని కూడా చెప్పేసిన ఈ స‌ర్వే... ఆ పెరిగిన శాతాన్ని ఏడుగా నిర్దారించేసింది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ఈ స‌ర్వే నిర్వ‌హించ‌గా... మోడీ బెట‌ర్ అని 52 శాతం మంది చెప్పగా - రాహుల్ గాంధీకి 27 శాతం మంది మాత్రమే ఓటేశారు. ఇతర ప్రాంతీయ పార్టీలకు కేవలం 7.3 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. అంతకుముందు జనవరిలో మోడీకి 44.4 శాతం ఓట్లు - రాహుల్ గాంధీకి 30 శాతం ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మోడీ గ్రాఫ్ పెరగగా - రాహుల్ గ్రాఫ్ తగ్గింది. రాహుల్‌ గాంధీ నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారని దాదాపు 43 శాతం మంది అభిప్రాయపడ‌గా... 40 శాతం మంది మాత్రం దీనిని వ్యతిరేకించారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలను అతి తక్కువగా నెరవేర్చిందని 46 శాతం చెప్పగా, 27 శాతం మంది మాత్రం హామీలన్నింటిని నెరవేర్చిందని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఉద్యోగ కల్పనే అతిపెద్ద ఎన్నికల అంశంగా 40 శాతం మంది చెప్ప‌గా... 17.7 శాతం మంది మాత్రం వ్యవసాయమని - 14 శాతం మంది రామమందిర నిర్మాణమని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆదాయపన్ను పరిమితి పెంపు అంశంపై ప్రశ్నించగా బాగుందని 33 శాతం - కాస్త ఆలస్యమైందని 29.9 శాతం మంది - ఎన్నికల స్టంటేన‌ని 24.1 శాతం మంది చెప్పారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నుంచి పెద్దగా ఉపయోగం లేదని 30 శాతం మంది అభిప్రాయపడగా - రైతులకు ఎంతో మేలు అని - బాగుందని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News