టోపీ పెట్టుకోలేదు..పాదాభివందనమే చేశారు మరి

Update: 2015-07-31 04:48 GMT
గుడ్డు మీద ఈకలు పీకేవాళ్లు ఈ దేశంలో చాలామందే ఉన్నారు. ఒక సంఘటనతో ఒక వ్యక్తిపై ఒక ముద్ర వేయటం మామూలే. ఇక.. రాజకీయాల్లో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.  ప్రధానిపై కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్ర వేసే వారు..అక్కడితో ఆగకుండా ఆయన ముస్లిం వ్యతిరేకి అన్న అపప్రదను ప్రచారంలోకి తెచ్చారు. హిందుత్వాన్ని వినిపించటం.. వారికి అనుకూలంగా ఉండటం ఈ దేశంలో బూతేమీ కాదు.

ఆ మధ్య మోడీ.. ముస్లింలకు సంబంధించిన ఒక కార్యక్రమానికి హాజరు కావటం.. వారు తమ మత సంప్రదాయాలకు చిహ్నమైన టోపీని పెట్టే ప్రయత్నం చేయటం.. దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించటం తెలిసిందే. దీనిపై లౌకికవాదుల పేరిట నానా యాగీ చేసేశారు. ఒక ముస్లిం హిందూ సంప్రదాయాల్ని తిరస్కరించటం తప్పేమీ కాదు. అదే సమయంలో.. ఒక హిందువు ముస్లిం సంప్రదాయాలను తాను అనుసరించనని చెప్పటం తప్పేం కాదు కదా.

ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. అన్య మతస్తులు.. హిందువుల దేవుళ్లకు పెట్టిన ప్రసాదం ఇస్తే.. దాన్ని తీసుకోవటానికి ససేమిరా అంటారు. ఆ ప్రసాదం వారికి ఎంతో ఇష్టమైన ఆహారపదార్థం అయినప్పటికీ.. హిందూ దేవుడికి నివేదించారన్న కారణంగా.. దాన్ని తినేందుకు ఇష్టపడరు. అదేమీ తప్పుగా కనిపించని వారికి.. మస్లింలు మత సంప్రదాయం ప్రకారం ధరించే టోపీని మోడీ పెట్టుకోకపోవటాన్ని అంత రార్థంతం చేయటం ఎందుకు?

ఒకవేళ.. దాన్ని రార్థంతం చేసే వారు.. తాజాగా మోడీ చేసిన ఒక చర్య గురించి మాట్లాడతారా? అన్నది ప్రశ్న. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల కోసం రామేశ్వరం వెళ్లిన ప్రధాని మోడీ.. కలాం అన్న ముత్తు మహ్మద్ మరైకర్ ను పరామర్శించినప్పుడు.. ఆయనకు పాదాభివందనం చేశారు.

ముస్లిం మత ధర్మానికి చిహ్నమైన ఒక టోపీని పెట్టుకోవటాన్ని ఒప్పుకోలేదంటూ.. అదేదో పెద్ద అపరాధం అంటూ వ్యాఖ్యలు చేసిన కొందరు లౌకికవాదులు.. తాజాగా కలాం అన్నయ్యకు మోడీ పాదాభివందనం చేయటాన్ని ఎందుకు ప్రస్తావించటం లేదు.

గుడ్డు మీద ఈకలు పీకే లౌకికవాదులని చెప్పుకునే వారి భాషలో చెప్పాలంటే.. ఒక ముస్లింకు మోడీ పాదాభివందనం చేయటాన్ని గొప్పగా ఎందుకు ప్రస్తావించరు? ఒక విషయాన్ని తప్పు పట్టేందుకు ప్రదర్శించే ఉత్సాహం.. మరో విషయంలో పొగిడేందుకు ఎందుకు మక్కువ ప్రదర్శించరు..?

తమకున్న అభిప్రాయానికి బలం చేకూరే అంశాల్ని తప్పించి.. అవి తప్పు అన్న భావన కలిగించే ఏ అంశం జరిగినా.. జరగనట్లే ఉండిపోవటం గమనార్హం. టోపీ ధరించని మోడీ.. ఒక నికార్సు అయిన ముస్లిం పెద్దమనిషికి ఎలాంటి మొహమాటం లేకుండా పాదాభివందనం చేయటాన్ని చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో మతాన్ని తాను పట్టించుకోనన్న విషయాన్ని మోడీ తన తాజా చర్యతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News