మోదీ మనసును తిరుమల వెంకన్న మారుస్తాడా?

Update: 2019-06-07 07:53 GMT
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మోజారిటీ రాకపోయి ఉంటే బాగుండేదని - ప్రత్యేక హోదాపై నిలదీసే అవకాశం ఉండేదని పేర్కొంటూ తొలి రోజే చేతులెత్తేసిన జగన్.. తమ ప్రయత్నాలు మాత్రం కొనసాగుతాయని మాత్రం స్పష్టం చేశారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రత్యేక హోదాపై మోదీని అడుగుతూనే ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి వెంకన్న దర్శనానికి రాబోతున్నారు. ఈ సందర్భంగా మోదీని కలవనున్న జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని మరోమారు లేవనెత్తాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్న సంకేతాల్ని ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక తిరుమల స్వామి వారి దర్శనానికి రానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.  టీటీడీ పాలక మండలి చీఫ్ అనిల్ కుమార్ సింఘాల్‌ - చిత్తూరు కలెక్టర్ నారాయణ గుప్తా - ఇతర అధికారులతో సుబ్రహ్మణ్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నదీ తెలుసుకుని అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చారు.

మాల్దీవులు - శ్రీలంక పర్యటనను ముగించుకున్న అనంతరం మోదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి - గవర్నర్ నరసింహన్ స్వాగతం పలుకుతారు. అక్కడ గెస్ట్ హౌస్‌ లో 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నాక తిరుమల శ్రీవారి దర్శనానికి మోదీ బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు వరాహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం  శ్రీవారి ఆలయంలో పూజలు చేసి 7:20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు.
 
Tags:    

Similar News