నామినేషన్ వేళ కాళ్లు మొక్కిన మోడీ

Update: 2019-04-26 09:14 GMT
ప్రధాని నరేంద్రమోడీ వారణాసి నుంచి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానానికి మోడీ వరుసగా రెండోసారి పోటీపడుతుండడం విశేషం.

నామినేషన్ కు ముందు శుక్రవారం ఉదయం వారణాసిలోని కాలభైరవుడికి మోడీ పూజలు చేశారు. అనంతరం శిరోమణి అకాలీదళ్ అధినేత, రాజకీయ కురువృద్ధుడు ప్రకాష్ సింగ్ బాదల్ కు మోడీ పాదాభివందనం చేసి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకోవడం విశేషం.

 అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని బీజేపీ అభ్యర్థిగా నరేంద్రమోడీ నామినేషన్ పత్రాలను కలెక్టర్ కు సమర్పించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు ఎన్డీఏ కు చెందిన కేంద్రమంత్రులు రాజ్ నాథ్, సుష్మ స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, యూపీ సీఎం యోగి, బీహార్ సీఎం నితీష్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, లోక్ జనశక్తి నేత రాంవిలాస్ పాశ్వాన్ , తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా హేమాహేమీలందరూ పాల్గొన్నారు.

గురువారం సాయంత్రమే వారణాసికి చేరుకున్న మోడీ అక్కడ వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంగాహారతి నిర్వమించారు. శుక్రవారం ఉదయం బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

వారణాసిలో మోడీపై పోటీకి కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి షాలినీ యాదవ్ పోటీచేస్తున్నారు. మే 19న చివరి విడతలో వారణాసిలో పోలింగ్ జరుగుతుంది.

గత 2014 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీచేసిన మోడీ.. తన సమీప ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ పై 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
Tags:    

Similar News