ప్రధాని మోడీ విశాఖ టూర్‌.. జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు శుభవార్త!

Update: 2022-11-05 09:32 GMT
విశాఖపట్నంలో నవంబర్‌ 11న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ కీలక సమయంలో ఏపీ హైకోర్టు జగన్‌ ప్రభుత్వానికి శుభవార్తను వినిపించింది. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి భూముల సేకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటిపై దాఖలైన అనుమతులను కొట్టేసింది.

కాగా నవంబర్‌ 11న విశాఖ పర్యటనకు వస్తున్న నరేంద్ర మోడీ 12న విశాఖపట్నంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఖరారైంది. కాగా ప్రధానమంత్రి కార్యాలయం భోగాపురం విమానాశ్రయంకు శంకుస్థాపన అంశాన్ని ఆయన కార్యక్రమాల జాబితాలో చేర్చలేదని సమాచారం. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తుండటమే ఇందుకు కారణం.

అయితే తాజాగా హైకోర్టు భోగాపురం భూసేకరణకు సంబంధించి దాఖలైన పిటిషన్లను కొట్టేయడంతో ఈ అంశాన్ని ప్రధాని మోడీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టుల జాబితాలో చేర్చడానికి జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది. మొత్తం 14 ప్రాజెక్టుల వరకూ శంకుస్థాపనలో చేర్చినా వాటిలో 8 ప్రాజెక్టులకు మాత్రమే ప్రధాని కార్యాలయం అనుమతి ఇచ్చినట్టు సమాచారం. దీంతో మిగతా ప్రాజెక్టులను కూడా ఇందులో చేర్చేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

కాగా వాస్తవానికి భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు ప్రభుత్వం 2019లోనే శంకుస్థాపన చేసింది. అయితే భూసేకరణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణపై దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు నవంబర్‌ 4న కొట్టేసింది. గతంలో భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. మొత్తం 2,700 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 2,200 ఎకరాలు విమానాశ్రయం కోసం, మిగిలిన 500 ఎకరాలు అనుబంధ కార్యకలాపాల కోసం వినియోగించాలని నిశ్చయించింది. ఎయిర్‌పోర్టు కోసం సేకరించాల్సిన 2,200 ఎకరాల్లో 2,064 ఎకరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. మిగిలిన భూముల సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు హైకోర్టు ఈ సమస్యను పరిష్కరించడంతో భూ సేకరణ పూర్తి కానుంది.

హైకోర్టు తీర్పుతో భోగాపురం ఎయిర్‌ పోర్టు భూసేకరణలో తలెత్తిన ఇబ్బందులు సమసిపోవడంతో ప్రధాని మోడీ విశాఖ టూర్‌ లో దీనికి శంకుస్థాపన చేయించాలని జగన్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్లో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపనను కూడా చేర్చడానికి ప్రయత్నిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News