అంబేద్క‌ర్‌.. దేశంపై చెరగ‌‌ని సంత‌కం!

Update: 2021-04-14 06:29 GMT
‘‘లండన్ యూనివర్సిటీ.. ఉద‌యం 8 గంట‌ల‌కు లైబ్ర‌రీ తెరిచేవారు.. వాచ్ మెన్ వ‌చ్చి తాళం తీయ‌డానికి ముందే ఒక వ్య‌క్తి వ‌చ్చి గేటు ముందు నిల‌వ‌డి ఉండేవాడు. రాత్రి 8 గంట‌ల‌కు లైబ్ర‌రీని మూసేస్తారు. అంద‌రూ వెళ్లిపోయినా ఒక వ్య‌క్తి పుస్త‌కం చ‌దువుతూనే ఉండేవాడు. ఆ వాచ్ మెన్ వ‌చ్చి.. టైమ్ అయిపోయిందండి అన‌గానే.. మ‌రుక్ష‌ణ‌మే పుస్త‌కం మూసేసి బ‌య‌లు దేరేవాడు.’’ ఇది రోజూ జ‌రిగే ప్ర‌క్రియ అని స్వ‌యంగా వెల్ల‌‌డించారు అక్క‌డి వాచ్ మెన్. ఆ వ్య‌క్తే.. భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్క‌ర్‌.

భార‌త‌దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న దారుణ స‌మ‌స్య‌ల్లో ఒక‌టి కులం. ఇది ఎవ్వ‌రూ కాద‌న‌లేని స‌త్యం. ఇప్ప‌టికీ ప‌లు రూపాల్లో క‌నిపించే ఈ కుల జాఢ్యం.. వందేళ్ల క్రితం బ‌హిరంగంగానే రాజ్య‌మేలేది. కులం దారుణాల‌ను చ‌విచూసిన ఎంతో మందిలో అంబేద్క‌ర్ ఒక‌రు. మ‌హారాష్ట్ర‌లోని ర‌త్న‌గిరి జిల్లా అంట‌వాడ గ్రామంలో జ‌న్మించిన అంబేద్క‌ర్ మ‌హ‌ర్ కుల‌స్థుడు. అంటే.. మ‌న ద‌గ్గ‌రి ఎస్సీ కులానికి చెందిన వారు.

అప్ప‌ట్లో అగ్ర కులాలుగా చెప్పుకునేవారు.. బీసీలుగా ఉన్న‌వారు.. కింది కులాల వారిని క‌నీసం తాకేవారు కూడా కాదు. వాళ్లు అంట‌రాని వాళ్లంటూ ఊరికి దూరంగా నెట్టేసిన స‌మాజం.. అంబేద్క‌ర్ ను బ‌డిలోకి కూడా రాని‌వ్వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. చ‌‌దువుకోవాల‌ని ఎంత‌గానో ఆరాట‌ప‌డిన‌ అంబేద్క‌ర్.. పాఠ‌శాల బ‌య‌ట‌నే ఉండి చ‌దువు నేర్చుకున్నారు. క‌నీసం.. బ‌డిలో నీళ్లు తాగడానికి కూడా అవ‌కాశం ఇచ్చేవారు కాదు. ప్యూన్ వ‌చ్చి గొంతులో పోస్తే త‌ప్ప‌.. గొంతు త‌డిసేది కాదు.

అలాంటి అంబేద్క‌ర్‌.. చ‌దువే త‌న జీవితాన్ని మారుస్తుంద‌ని బ‌లంగా విశ్వ‌సించారు. అయితే.. ఆయ‌న ఆశ‌యానికి అండ‌గా నిలిచారు బ‌రోడా రాజు శ‌యాజీరావ్ గైక్వాడ్‌. ఆయ‌న ఇచ్చిన 25 రూపాయ‌ల స్కాల‌ర్ షిప్ తో 1912లో డిగ్రీ (బీ.ఏ) ప‌ట్టా అందుకున్నారు. అంత‌టితో ఆగ‌లేదు. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌నుకున్నారు. దానికి కూడా రాజు స‌హ‌క‌రించారు. అయితే.. వ‌చ్చిన త‌ర్వాత ప‌దేళ్ల‌పాటు బ‌రోడా సంస్థానంలో ప‌నిచేయాల‌న్న ష‌ర‌తు మీద 1913లో కొలంబియా విశ్వ‌విద్యా‌ల‌యంలో చేరారు అంబేద్క‌ర్‌. ఎం.ఏ, పీహె.చ్.డీ. పూర్తి చేసిన త‌ర్వాత 1917లో ఇండియా తిరిగి వ‌చ్చారు.

అప్ప‌టికే దేశంలో స్వ‌తంత్ర పోరాటం జోరుగా సాగుతోంది. అందులో త‌న వంతు పాత్ర పోషించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే.. కులం విష‌యంలో విభేదాలు త‌లెత్త‌డంతో గాంధీ ఉద్య‌మం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ద‌ళిత, బ‌హుజ‌నుల‌ జ‌నోద్ధ‌ర‌ణ‌కు ఉద్య‌మించారు అంబేద్క‌ర్‌. ఇక స్వాతంత్రం వ‌చ్చిన త‌ర్వాత భార‌త దేశానికి రాజ్యాంగం అవ‌స‌ర‌మైంది. రాజ్యాంగం రాయ‌డానికి స‌రైన మేధావిగా అంబేద్క‌ర్ మాత్ర‌మే క‌నిపించారు. అందుకే.. రాజ్యాంగ ప‌రిష‌త్ క‌మిటీకి అంబేద్క‌ర్ ను అధ్య‌క్షుడిగా నియ‌మించారు.

అనేక దేశాల రాజ్యాంగాల‌ను కూలంక‌షంగా చ‌దివి.. భార‌త రాజ్యాంగాన్ని లిఖించ‌డానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. దేశంలో శ‌తాబ్ధాలుగా వివ‌క్ష‌కు, అంట‌రానిత‌నానికి గుర‌వుతున్న ద‌ళితులకు, బీసీల అభ్యున్న‌తికి రాజ్యాంగంలో పెద్ద‌పీట వేశారు అంబేద్క‌ర్‌. వారిని కూడా అంద‌రితో స‌మంగా ఎదిగేందుకు అవ‌కాశాలు క‌ల్పించారు. దేశంలో అంద‌రూ స‌మానంగా ఎద‌గాలని ఆయ‌న ఆకాంక్షించారు. చివ‌రి వ‌ర‌కూ అణ‌గారిన వ‌ర్గాల అభ్యున్న‌తికి కృషి చేసిన అంబేద్క‌ర్‌.. 1956 డిసెంబ‌ర్ 6న క‌న్నుమూశారు.

అయితే.. ఇవాళ రిజ‌ర్వేషన్ల గురించి తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. కానీ.. అంబేద్క‌ర్ ఆశించిన స‌మాన‌త్వం ఎంత వ‌ర‌కు సిద్ధించింద‌న్న‌దే ప్ర‌శ్న‌. అంబేద్క‌ర్ రాజ్యాంగంలో క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్లు స్వ‌ల్ప కాలానికే అని స్ప‌ష్టంగా చెప్పారు. అప్ప‌టిలోగా అంద‌రూ ఒకే స్థాయికి వ‌చ్చేస్తార‌ని ఆయ‌న‌ భావించారు. కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. రూపం మార్చుకున్న కులం చీడ పురుగు దేశాన్ని ఇంకా న‌మిలేస్తూనే ఉన్న‌ది. ఇప్ప‌టికీ అణ‌గారిన వ‌ర్గాలు వివ‌క్ష‌ను ఎదుర్కొంటున్న‌ది కాద‌న‌లేని స‌త్యం.

ఈ ప‌రిస్థితికి దేశాన్ని పాలించిన పార్టీలే స‌మాధానం చెప్పాలంటారు మేధావులు. కేవ‌లం ఓట్ల రాజ‌కీయం చేస్తూ వ‌చ్చిన పార్టీలు.. రిజ‌ర్వేష‌న్ల‌ను పొడిగిస్తూ వ‌చ్చాయ‌ని చెబుతుంటారు. అదే స‌మ‌యంలో.. కులం, ఇత‌ర వివ‌క్ష‌ల‌ను పార‌దోలేందుకు ప్ర‌య‌త్నించ‌క‌పోగా.. త‌మ స్వార్థం కోసం పెంచుతూ వ‌చ్చాయ‌నే విమ‌ర్శ‌లు కూడా చేస్తుంటారు. త‌ద్వారా.. అంబేద్క‌ర్ ఆశ నిరాశ‌గానే మిగిలిపోయిందంటారు.

అయితే.. ఒక్క‌టి మాత్రం వాస్త‌వం. దేశం స‌మానత్వం-అభివృద్ధి అనే జోడు గుర్రాలపై అధిరోహించిన‌ప్పుడే.. విశ్వ య‌వ‌నిక‌పై మువ్వ‌న్నెల జెండా స‌గ‌ర్వంగా త‌లెత్తుకుంటుంది. ఇందుకోసం కృషిచేయ‌డ‌మే ప్ర‌తీ భార‌తీయుడి క‌ర్త‌వ్యం. అప్పుడే.. దేశం కీర్తిప‌తాక విశ్వ వినువీధుల్లో రెప‌రెప‌లాడుతుంది. ఇదే.. అంబేద్క‌ర్ కు స‌మ‌ర్పించే నిజ‌మైన నివాళి!
Tags:    

Similar News