కేసీఆర్ ఫ్రంట్ ప్లాన్స్ కు ఈ సారి మిశ్రమ స్పందన!

Update: 2019-05-07 14:30 GMT
దక్షిణాది వ్యక్తి పీఎం పీఠంపై కోర్చోవాలి.. అంటూ తన ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త సిద్ధాంతాన్ని జోడించారట కేసీఆర్. గత కొన్ని పర్యాయాలుగా ఉత్తరాది వ్యక్తులే ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తూ వస్తున్నారు. ఎంతసేపూ వాళ్లే.. సౌతిండియన్లకు అవకాశం ఎప్పుడు అన్నట్టుగా.. ఆ లోటును కూడా తీర్చేలా తన ఫెడరల్ ఫ్రంట్ ప్లాన్స్ తో ఉన్నారట కేసీఆర్. అందులో భాగంగా ఆయన పీఎం క్యాండిడేట్ గా కూడా ఒక ప్రముఖుడిని ఎంపిక చేసుకున్నారట! ఆయన మరెవరో కాదు.. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్!

ఈ సీపీఎం నేతను ప్రధానమంత్రి  పదవికి తగిన వ్యక్తిగా అనుకుంటున్నారట  కేసీఆర్. విజయన్ తో  సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్నే ప్రస్తావించారట. అయితే ప్రెస్ మీట్లో మాత్రం విజయన్ ఆ మాట చెప్పలేదు. బీజేపీ, కాంగ్రెస్ ల కూటముల్లో వేటికీ సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు, ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో కీలక భూమిక పోషించబోతున్నాయి.. అని వ్యాఖ్యానించిన విజయన్, కేసీఆర్ ప్రతిపాదనలను తమ పార్టీ అధినాయకత్వం వద్దకు తీసుకెళ్తాం.. అని అన్నారు.

ఇక సీపీఎం వాళ్ల నుంచి ఇలా పాజిటివ్ స్పందనే వచ్చినా. ఈ ఫ్రంట్ ఆలోచనతో కేరళకు వెళ్లిన కేసీఆర్ అటు నుంచి అటే వెళ్లి తమిళనాడు నేత స్టాలిన్ ను కలిసే ప్రయత్నాలకు మాత్రం సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. స్టాలిన్ తో ఈ నెల పదమూడున కేసీఆర్ సమావేశం కాబోతున్నారని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఆ సమావేశాం కుదిరేలా లేదని సమాచారం.

తమిళనాట ఇంకా ఎన్నికల ప్రక్రియ కొంత మిగిలే ఉంది. అక్కడ కొన్ని అసెంబ్లీ సీట్లకు బై పోల్స్  ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఆ ప్రచార పనుల్లో బిజీగా ఉన్నారని.. దీంతో ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేకపోతున్నట్టుగా డీఎంకే వర్గాలు సమాచారం ఇచ్చాయట. దీంతో స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం ప్రస్తుతానికి లేనట్టే అని టాక్. ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదని టీఆర్ ఎస్  వర్గాలు అంటున్నాయి.

ఇక ఫెడరల్ ఫ్రయత్నాల్లో భాగంగా ఇది వరకే కేసీఆర్ వివిధ పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. అప్పుడు కేసీఆర్ తో బాగానే మాట్లాడిన వాళ్లు కూడా ఆ తర్వాత పెద్దగా స్పందించలేదు. అయితే వారినే కేసీఆర్ మళ్లీ కలవబోతూ ఉన్నారని సమాచారం.

మమతా బెనర్జీ,  మాయవతి, అఖిలేష్ యాదవ్. .వీళ్లందరితోనూ కేసీఆర్ మళ్లీ సమావేశం కాబోతూ ఉన్నారట. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నట్టే కనిపిస్తూ, మరోవైపు ఆ పార్టీతో పోరాడుతూ ఉన్నారు పై ముగ్గురు  నేతలూ. వారితో కేసీఆర్ సమావస్త్రశం ఎప్పుడు  జరుగుతుందో, వారు ఈయన ప్రయత్నాలకు ఎలా స్పందిస్తారో!
Tags:    

Similar News