జాబ్ మారాలనుకునే వారికి తీపి కబురు చెప్పిన నౌకరీ జాబ్ స్పీక్ నివేదిక

Update: 2022-03-28 07:41 GMT
కరోనా కాలం ముగిసినట్లేనా? అన్న ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతున్నారు. రెండో వేవ్ తో పోలిస్తే.. మూడో వేవ్ లో కేసుల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ.. తీవ్రత ఏ మాత్రం లేకపోవటంతో.. ఈ దశ ఎంట్రీ నుంచి ఎండ్ వరకు పెద్దగా ప్రభావాన్ని చూపిందే లేదని చెప్పాలి. కరోనా సంగతి ఇలా ఉంటే.. చాలా రంగాల్లో వృద్ధి నమోదు కావటంతో నియమకాల వేగం కూడా పెరిగిన పరిస్థితి.

2021 ఫిబ్రవరితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో నియమకాల అవకాశాలు ఎక్కువ అవుతున్నట్లుగా తాజాగా విడుదలైన నౌకరీ జాబ్ స్పీక్ నివేదిక వెల్లడించింది.

గత ఏడాది ఫిబ్రవరిలో తమ ప్లాట్ పాంలో 2356 పోస్టులు ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 3074 పోస్టులు ఉండటమే నిదర్శనంగా పేర్కొంది. స్థిరమైన వృద్ధి.. దానికి తోడు సెంటిమెంట్.. విశ్వాసం రెండూ ఉద్యోగార్థుల్లో బలంగా ఉండటంతో నియమకాల ఊపు సాగుతోంది. ఇక.. నియామకాల విషయానికి వస్తే.. దేశంలోని మెట్రో నగరాల్లో కోల్ కతా ముందు వరుసలో ఉండటం గమనార్హం.

కోల్ కతాలో 56 శాతం.. బెంగళూరులో 49 శాతం.. ముంబయిలో 45 శాతం.. చెన్నైలో 45 శాతం.. హైదరాబాద్ లో 43 శాతం.. ఫూణెలో 41 శాతం.. ఢిల్లీలో 30 శాతం మేర పెరిగినట్లుగా ఈ నివేదిక పేర్కొంది. ఇక.. మెట్రోయేతర నగరాలైన కోయంబత్తూర్ లో 57 శాతం. .అహ్మదాబాద్ లో 32 శాతం.. కోచిలో 16 శాతం వృద్ధి కనిపించినట్లు చెబుతున్నారు.

ఇక.. నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం ఏయే రంగాల్లో ఎంతటి వృద్ధి ఉందన్నవిషయానికి వస్తే..బీమా అగ్రస్థానంలో నిలిచింది. బీమా రంగంలో 74 శాతం.. తర్వాతి స్థానం రిటైల్ రంగానిదేనని చెబుతున్నారు.

ఐటీ-సాఫ్ట్ వేర్ సేవలు 41 శాతం.. ఆతిథ్య రంగంలో 41 శాతం.. బ్యాంకింగ్ - ఆర్థిక సేవలు 35 శాతం.. ఔషధ రంగంలో 34 శాతం.. టెలికాం రంగంలో 23 శాతంగా పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో సింగిల్ డిజిట్ గా నమోదైంది. మొత్తంగా చూసినప్పుడు గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది నియమకాల జోరు మాత్రం పెరిగిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News