మోడీ దెబ్బకు భయపడిన ముఖ్యమంత్రి..

Update: 2019-03-23 05:19 GMT
ఎన్నో ఏళ్లు తిరుగులేకుండా ఉన్న నేతలకు ఎక్కడో ఒక చోట వారి దూకుడుకు కళ్లెం పడుతుంది. తరతరాలు అధికారంలో ఉంటున్నా వారిని ఢీకొట్టేందుకు వ్యతిరేకత చిన్నగా ప్రారంభమై వారి ఓటమికి కారణమవుతుంది. 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టి రికార్డు సృష్టించిన ఒడిశా ముఖ్యమంత్రి ఈసారి కూడా పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు.

ఒడిశా రాష్ట్రంలో పార్లమెంట్‌ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సంవత్సరం ముందు నుంచే బీజేడీ అధినేత రకరకాల వ్యూహాలు రచించారు.నోటిఫికేషన్‌ విడుదలవుతున్న తరుణంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ సంచలన ప్రకటన చేసి ఆకట్టుకున్నారు.  అయితే నవీన్‌ పట్నాయక్‌ కు ఈసారి గెలుస్తానో లేదోననే భయం పట్టుకుందట. ఆ భయానికి బీజేపీయే కారణమని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ఒడిశాలో దాదాపు 20 ఏళ్లుగా బిజూ జనతాదళ్‌ పార్టీ అధికారంలో ఉంటూ వస్తోంది. ఇక్కడ జాతీయ పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నవీన్‌ పట్నాయక్‌ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. అయితే ఈసారి మాత్రం తన విజయపరంపరకు బ్రేక్‌ పడే అవకాశాలున్నాయని సమాచారం రావడంతో సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఆయన పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత వస్తుందని తెలుసుకున్న ఒడిశా సీఎం ఈసారి రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేయడం ఆయన భయానికి కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

గంజా జిల్లా హింజలి నియోజవకర్గం నుంచి నవీన్‌ పట్నాయక్‌ గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అక్కడ నామినేషన్‌ దాఖలు చేశారు.ఈ నియోజకవర్గంలో నవీన్‌ పట్నాయక్‌ ఓడిపోతున్నట్లు సర్వేల ద్వారా తెలుసుకున్నాడట. ఈ విషయాన్ని   బీజేపీ నేతలు కూడా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. నవీన్‌ పోటీ చేసిన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్డడంలో విఫలమయ్యారని - అందుకే ఆయనకు ఓట్లు పడే అవకాశం లేదని ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారం. దీంతో ఆయన ముందు జాగ్రత్తగా మరో నియోజకవర్గం బిజేపూర్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేయనున్నారని బీజేడీ  వర్గాలు పేర్కొన్నాయి.

20 ఏళ్లుగా అధికారంలో ఉంటున్న బీజేడీని ఇప్పుడు బీజేపీ షేక్ చేస్తోంది. నవీన్ పట్నాయక్ ను అధికారంలోకి రాకుండా బీజేపీ నాయకులు  చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఈసారి రాష్ట్రంలో బీజేపీ పాగా వేయనుందా..? అనే అనుమానాలు బలపడుతున్నాయి.ప్రస్తుతం బీజేపీతోపాటు కాంగ్రెస్‌ కూటమి - బీజేడీలు ఒడిషాలో పోటీపడుతున్నాయి. దీంతో త్రిముఖ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఒడిశాలో  తమ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల గురించి కమలం నాయకులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తున్న తరుణంలో దక్షిణాదిలో ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ లో బీజేపీకి అవకాశం లేకుండా పోయింది. ఉత్తర భారతంలోని ప్రధానమైన మధ్యప్రదేశ్ - రాజస్తాన్ - చత్తీస్‌ గఢ్‌ లో బీజేపీ అధికారం కోల్పోయింది.. దీంతో ఒడిశాలో ఎలాగైనా కాషాయం జెండా ఎగురవేసేందుకే మోడీ ఒడిశాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎంపై స్థానిక బీజేపీ నేతలు వ్యతిరేక ప్రచారం చేయడం ప్రారంభించారు. నవీన్‌ పోటీ చేస్తున్న హింజలి నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో సీఎం పట్టించుకోవడం లేదని, అందుకే నవీన్‌ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ దెబ్బకు భయపడిన సీఎం రెండు చోట్ల నామినేషన్‌ వేశారు. అయితే 20 ఏళ్ల దూకుడుకు నవీన్‌ పట్నాయక్‌ కు బీజేపీ నేతలు కళ్లెం వేయనున్నారా..? లేక ప్రజాకర్షక పథకాలతో మరోసారి నవీన్‌ ముఖ్యమంత్రి అవుతారా..? అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది.
Tags:    

Similar News