నిజంగా ఈ సీఎం గ్రేట్..

Update: 2019-05-29 09:02 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు సార్లు..అదీ వరుసగా.. ఒక జనరేషన్ మొత్తం ఆయనే సీఎం.. వేరే సీఎం అంటూ లేరు.. వేరే సీఎం పాలనను ఈ ఒడిషా వాసులు చూసి ఉండలేదు.. సీఎం అంటే ఒడిషా ప్రజలకు ఆయనే.. నవీన్ పట్నాయక్ ను తప్ప వేరే వ్యక్తిని సీఎంగా ఊహించుకోలేకపోతున్నారు ఒడిషా ప్రజలు. అలా అని ఆయన ఏం చేయకుండా అలా సీఎంగా కొనసాగుతున్నారంటే పొరపాటే.. దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు.. అవినీతి రహిత పాలనతో ప్రజలకు చేరువ అయ్యారు నవీన్ పట్నాయక్.

బిజు జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఇది ఐదోసారి ఆయన పార్టీ గెలవడం..ఐదోసారి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. భవనేశ్వర్ ఎగ్జిబిషన్ మైదానంలో గవర్నర్ గణేశీలాల్ ఆయన చేత ఒడిషా సీఎంగా ప్రమాణం చేయించారు. నవీన్ పట్నాయక్ తోపాటు 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

నవీన్ పట్నాయ్ చరిత్ర మామూలుగా లేదు. 2000 సంవత్సరం నుంచి ఆయన ఒడిషా సీఎంగా ప్రతీ ఐదేళ్లకోసారి గెలుస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 147 స్థానాలున్న ఒడిషా శాసనసభలో బిజూ జనతాదళ్ 112 సీట్లు సాధించి రాష్ట్రంలో ఐదోసారి అధికారంలోకి వచ్చింది. ఇక 23 సీట్లతో బీజేపీ ఒడిషాలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్ కు 9 సీట్లకే పరిమితమైంది.

ఓట్లశాతం చూస్తే అధికార బీజేడీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 44.7శాతం ఓట్లు రాబట్టుకుంది. బీజేపీ 32.5శాతం ఓట్లను.. కాంగ్రెస్ 16.12శాతం ఓట్లను పొందాయి. ఇక రెండు చోట్ల హింజలీ - బీజేపూర్ నుంచి పోటీచేసిన నవీన్ పట్నాయక్ రెండు చోట్ల గెలవడం విశేషం. నవీన్ పట్నాయ్ ఐదోసారి గెలవడం దేశంలోనే ఓ రికార్డ్. ఈయన తప్ప వేరే వాళ్లని సీఎంగా ఒడిషా ప్రజలు అస్సలు ఊహించుకోకపోవడం ఆసక్తి రేపుతోంది. తాజాగా 2000 నుంచి సీఎంగా ఉన్న నవీన్ ను ఒక జనరేషన్ మొత్తం చూస్తు వస్తోంది. వేరే సీఎంను వీరు చూడలేదంటే అతిశయోక్తి కాదు.


Tags:    

Similar News