మ‌న‌కేం తెల్వదు.. అంతా అమెరికోళ్ల‌దే..!

Update: 2017-11-22 05:10 GMT
ఆయ‌న సాక్ష్యాత్తు రాష్ట్ర హోంమంత్రి.  ఆయ‌న‌కు తెలీకుండా రాష్ట్రంలో ఏమైనా జ‌రుగుతాయా? అన్న డౌట్ రావొచ్చు. కానీ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రినాయిని న‌ర‌సింహారెడ్డి మాట‌లు చూస్తే అది నిజ‌మ‌నించ‌క మాన‌దు. మ‌రో ఆరు రోజుల వ్య‌వ‌ధిలో హైద‌రాబాద్ లోజ‌రిగే అంత‌ర్జాతీయ అంత్ర‌పెన్యూర్ షిప్ స‌మ్మిట్‌ కు అమెరికా అద్య‌క్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఈ స‌మ్మిట్‌ కు సంబంధించి కీల‌క‌మైన భ‌ద్ర‌త అంశాలపై మ‌న‌కేం సంబంధం లేద‌ని.. అంతా అమెరికావాళ్లే చూసుకుంటారంటూ నాయిని వ్యాఖ్యానించారు. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు సంబంధించి వేదిక‌తో పాటు.. ఇవాంకా ట్రంప్ బ‌స చేసే ప్రాంతం మొద‌లు.. ఆమె ప‌ర్య‌టించే ప్ర‌తి ప్రాంతం అమెరికా నిఘా విభాగం చేతుల్లోకి వెళ్లింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. ఇవాంకా భ‌ద్ర‌త వ్య‌వ‌హారాల ఏర్పాట్ల‌పై నాయినిని ప్ర‌శ్నించిన‌ప్పుడు ఆయ‌న త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ‘యాడంగ వస్తందో.. యానంగ పోతందో మనకు తెల్వదు. అంతా అమెరికా వాళ్ల చేతుల్లోనే ఉంది’ అని నాయిని వ్యాఖ్యానించారు.

ఇవాంకా ట్రిప్ గురించి అడిగిన మ‌రో ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చేక్ర‌మంలో నాయిని.. మ‌న‌కేం తెల్వ‌దు.. అంతా అమెరికోళ్లు చేసుకుంటున్న‌రు.. వాళ్లు ఇప్ప‌టికే న‌గ‌రానికి వ‌చ్చిండ్రు అని వ్యాఖ్యానించారు. ఇంత ఓపెన్ గా విష‌యాన్ని చెప్పేసిన త‌ర్వాత ఏ మీడియా ప్ర‌తినిధి అయినా ఇంత‌కు మించి ఒక్క ప్ర‌శ్న అడ‌గ‌గ‌ల‌రు. అందుకే.. నాయిని చెప్పిన రెండు ముక్క‌లు రాసేయాల్సిన ప‌రిస్థితి. మ‌న గ‌డ్డ మీద‌కు వ‌చ్చి.. మ‌న‌కు తెల్వ‌కుండా యాడో తిర‌గ‌టం.. తిరిగే ముచ్చ‌టకు సంబంధించి క‌నీస స‌మాచారం ఇవ్వ‌క‌పోవుడేందో? ఎంత ట్రంప్ కూతురైతే మాత్రం మ‌రీ.. ఏం చెప్ప‌కుండా ఉండుడా?
Tags:    

Similar News