మొక్క పెట్టారో లేదో అశోకుడంటే ఎట్లా నాయిని?

Update: 2016-07-23 05:04 GMT
అధినేతను పొగిడే అవకాశం లభించాలే కానీ ఆకాశానికి ఎత్తేయటానికి నేతలంతా సిద్దంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. పొగడ్తలకు పరాకాష్ఠగా పొగిడే తీరు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కార్యక్రమాన్ని చేపట్టి.. దాని అమలు మీదన సందేహాలు తీర్చుకునేందుకు ఆకస్మిక తనిఖీల కోసం తాను సిద్ధమవుతున్నట్లు చెబుతుంటే.. మరోవైపు మంత్రులు మొదలు టీఆర్ ఎస్ నేతల వరకూ కేసీఆర్ ను అలనాటి అశోకుడితో పోల్చేయటం ఈ మధ్యన ఎక్కువైంది.

ఏ ముహుర్తంలో సూపర్ స్టార్ కృష్ణ నోటి వెంట.. ‘అశోకుడు చెట్లు నాటించెను అని చరిత్ర పుస్తకాల్లో చదివామని.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో చూస్తున్నమని’’ పొగిడేస్తూ.. ఆయన్ను అభినవ అశోకుడిగా కీర్తించటం తెలిసిందే. సీనియర్ నటుడు కృష్ణ నోటి నుంచి వచ్చింది మొదలు.. టీఆర్ ఎస్ నేతలు అదే పొగడ్తను పదే పదే పొగడటం కనిపిస్తోంది. దాదాపు రూ.250 కోట్ల ఖర్చుతో తెలంగాణరాష్ట్రం మొత్తంగా మొక్కల్ని నాటేందుకు హరితహారం పేరిట ఒక కార్యక్రమాన్ని షురూ చేయటం.. ఆ పని జోరుగా సాగుతున్నట్లు సమాచారం ఒకపక్క.. మరోవైపు.. మొక్కల్ని నాటటమే కానీ వాటిని అలనాపాలనా చూడటం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగితున్న పరిస్థితి.

ఇదిలాఉంటే మరోవైపు మంత్రులు మాత్రం కేసీఆర్ ను ఉద్దేశించి.. అశోకుడితో పొగిడేయటం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఒక పథకం మొదలై.. దాని ఫలాలు ఇంకా ఒక కొలిక్కి రాక ముందే దానికి సంబంధించి ఉత్సాహంతో అదే పనిగా పొగుడుతున్న వైనం అవాక్కు అయ్యేలా చేస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి  వ్యాఖ్యల్నే చూస్తే.. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అశోకుడు. రాజుల కాలంలో అశోక చక్రవర్తి పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పచ్చదనం కోసం ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమం చేపట్టి ఉద్యమంలా మొక్కలు నాటిస్తున్నారు’’ అని చెప్పుకున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఈ పొగడ్తల జోరు మరెంత స్థాయికి వెళుతుందో..?
Tags:    

Similar News