మూడేళ్ల‌లో విప‌క్షాలు మ‌టాష్‌

Update: 2016-11-06 07:48 GMT
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ కు అత్యంత ఆప్తుల్లో ఒక‌రైన‌ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట‌లు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. సీనియ‌ర్ నాయ‌కుడు అయిన‌ప్ప‌టికీ బోళాగా మాట్లాడే త‌త్వం ఉన్న నాయిని తాజాగా ప్ర‌తిప‌క్షాల‌పై సెటైర్ల‌తో కూడిన‌ విమ‌ర్శ‌లు చేశారు. అదే స‌మ‌యంలో టీఆర్ ఎస్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ లో మాజీ ఎమ్మెల్యే - టీఆర్‌ ఎస్ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నోముల నర్సింహయ్య తల్లి దశదిన కర్మకు హాజ‌రైన‌ హోంమంత్రి నాయిని అనంత‌రం విలేక‌రుల‌తో మాట్లాడారు. టీఆర్‌ ఎస్ సర్కారు రెండున్నర ఏళ్ల‌ వయస్సు చిన్నారి అని పేర్కొంటూ ఐదేళ్లు వచ్చాక డ్యాన్స్ చేసి చూపిస్తుందని.. అప్పుడు ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు. రాబోయే రెండేళ్ల‌లో టీడీపీ కనుమరుగైపోతుంద‌ని నాయిని జోస్యం చెప్పారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో,కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేలో నూ సీఎం కేసీఆర్ నంబర్ వన్‌ గా తేలడంతో ప్రతిపక్ష నేతలకు భయం పెరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని - పద్ధతి మారకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని నాయిని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ ను - ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని నాయిని మండిపడ్డారు. "రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులు కదిలిపోతున్నాయి. టీడీపీ ఇప్పటికే టీఆర్‌ ఎస్‌ లో విలీనమై కనుమరుగైంది. ఒక్క సీటు గెలిపించే నేతలు బీజేపీ - సీపీఎంలో లేరు. వీళ్ల వెంట ప్రజలు కూడా లేరు. మరో రెండున్నర ఏళ్ల‌లో ఆ పార్టీలు ఖేల్‌ ఖతం అయ్యే పరిస్థితి ఉండడంతో దిక్కుతోచని ఆ పార్టీ నేతలు ఎవరేం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. ప్రభుత్వంపై టీడీపీలోని బుడ్డరఖాన్ రేవంత్ రెడ్డి - జేఏసీ చైర్మ‌న్‌ కోదండరాం పదేపదే అర్థరహిత విమర్శలు చేస్తున్నారని - ఎంత తిడితే అంత పేరు వస్తుందనుకుంటున్నారని.. వారి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు" అని నాయిని మండిప‌డ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా గడ్డం తీయనని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, గడ్డాలు మీసాలతో అధికారంలోకి రారని.. ప్రజల విశ్వాసం ఉంటేనే సాధ్యమని నాయిని న‌ర్సింహా రెడ్డి అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆ పార్టీ వెంట నాయకులు - ప్రజలు లేరని ఎద్దేవాచేశారు. నయీం కేసు విచారణలో ఉందని, ఇందులో ప్రమేయం ఉన్నవారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సరైన శిక్ష పడుతుందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.హోంగార్డులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని, ఏపీలో రూ.9వేలు జీతం ఇస్తే రాష్ట్రంలో రూ.12వేలు, అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News