నాయిని నోట నిజాలు వెల్లువ‌లా వ‌చ్చేశాయ్‌

Update: 2018-01-12 04:33 GMT
ఉద్య‌మ‌నేత‌గా సుప‌రిచితుడు.. సుదీర్ఘ‌కాలం కార్మికుల హ‌క్కుల కోసం పోరాడిన నేత‌గా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని చెప్పొచ్చు. ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టంతో ఎలాంటి మొహ‌మాటానికి గురి కాని ఆయ‌న‌.. నిజాలు చెప్పేందుకు వెనుకాడ‌రు. తాజాగా ఒక స‌ద‌స్సులో మాట్లాడిన నాయిని మాట‌లు ఇప్పుడు తీవ్ర సంచ‌లనంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఒక‌ప్పుడు బండ‌బూతులు తిట్టిన ముం.. కొడుకులే ఎమ్మెల్యేలుగా.. ఎంపీలుగా.. రాష్ట్ర క్యాబినెట్ లోనూ  ఉన్నార‌న్నారు.

ఉద్య‌మ వేళ‌లో తిట్టినోళ్లు.. తిట్ట‌నోళ్లు అంతా తెలంగాణ రాష్ట్ర స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లుగా చెప్పారు. తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన టీడీపీని నామ‌రూపాల్లేకుండా చేసేందుకే ఆ పార్టీకి చెందిన కొంద‌రిని త‌మ పార్టీలోకి చేర్చుకున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు. 1969 తెలంగాణ  రాష్ట్ర ఉద్య‌మ‌కారుల సంఘం రూపొందించిన క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా మాట్లాడిన నాయిని కాస్తంత ఘాటుగా.. సూటిగా త‌న మ‌న‌సులోని మాట‌ల్ని చెప్పేశారు.

కేసీఆర్ ను తిట్టినోళ్లంతా ఇప్పుడు త‌మ‌తో పాటు అధికార‌పార్టీలో ఉన్నార‌న్న సాహ‌సోపేత‌మైన వ్యాఖ్య‌ను చెప్పేశారు. కేసీఆర్ ను  ఆకాశానికి ఎత్తేసిన  నాయిని.. అదే నోటితో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి మ‌ర్రి చెన్నారెడ్డి పైనా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మాజీ ముఖ్య‌మంత్రి మ‌ర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని  నీరుకార్చ‌లేద‌ని.. రాష్ట్రంలో మ‌గాడంటే మ‌ర్రి చెన్నారెడ్డేన‌ని వ్యాఖ్యానించారు.

1969 ఉద్య‌మ స్ఫూర్తితోనే తెలంగాణ ఆవిర్భ‌వించింద‌న్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘ‌న‌త కేసీఆర్‌ కే దక్కుతుంద‌న్న ఆయ‌న‌.. ఎన్నో శ‌క్తులు తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశాయ‌ని.. కానీ అవేమీ కేసీఆర్  ఉద్య‌మాన్ని అడ్డుకోలేక‌పోయాయ‌న్నారు.

1969 తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తితోనే మ‌లిద‌శ ఉద్య‌మం జ‌రిగింద‌ని.. తెలంగాణ ఏర్పాటుకు కార‌ణ‌మైంద‌న్న వ్యాఖ్య‌లు చేసిన నాయిని.. మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రికి భిన్నంగా వ‌రాలు ఇవ్వ‌కుండా మొండిచేయి చూపారు. 1969తో పాటు మ‌లిద‌శ ఉద్య‌మంలో ఎంతోమంది పాల్గొన్నార‌ని.. వారంద‌రికి పింఛ‌న్లు.. గుర్తింపు కార్డులు.. బ‌స్ పాస్ లు ఇవ్వ‌టం సాధ్యం కాద‌ని తేల్చేశారు. అయితే.. తెలంగాణ ఉద్య‌మంలో అమ‌రులైన కుటుంబాలకు మాత్రం మిన‌హాయింపులు ఉంటాయ‌ని.. వారిని ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌న్న మాట‌ను చెప్పారు. ఓప‌క్క ప్ర‌భుత్వం ఇరుకున‌ప‌డేలా వ్యాఖ్య‌లు చేసిన నాయిని మాట‌లు మంట పుట్టించ‌టం ఖాయ‌మంటున్నారు. మ‌రి.. ఆయ‌న మాట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News