రాజధాని అమరావతిపై ఉద్యమం.. ఎంత విష ప్రచారమంటే?

Update: 2022-09-12 04:28 GMT
ఒక ఉద్యమం జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే సాహసం దాదాపుగా జరగదు. ఎందుకంటే.. ఉద్యమం ఆద్యంతం భావోద్వేగంతో కూడుకున్నది. తొందరపడి ఒక మాట అనేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ పార్టీలు ఉద్యమాల విషయంలో స్టాండ్ తీసుకోవటానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. ఏ మాట అంటే ఏమవుతుందన్న ఆలోచనతో పాటు.. ఏదైనా వ్యతిరేకత వస్తే  జరిగే నష్టం గురించి ఆలోచించి అడుగు వేయటానికి సవాలచ్చ ఆలోచిస్తారు.

అలాంటిది నెగిటివ్ గా మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. కానీ.. విచిత్రంగా ఏపీ రాజధాని అమరావతి విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగిన పరిస్థితి. ఉద్యమం చేసే వారిని ఉద్దేశించి ఒక మాట అనేందుకు సాహసించని రాజకీయ పార్టీకి భిన్నంగా వైసీపీ నేతలు విరుచుకుపడిన వైనం.. అమరావతి కోసం ఉద్యమించిన రైతుల మీదా చేసిన విష ప్రచారం చూస్తే.. విస్మయానికి గురి కాకుండా ఉండలేం. అమరావతి కోసం అక్కడ భూములు ఇచ్చిన రైతుల మీదా.. వారు చేపట్టిన ఉద్యమాన్ని ఎంత తక్కువ చేసే ప్రయత్నం చేశారన్నది చూస్తే.. ఇదెలా సాధ్యమన్న భావన కలుగక మానదు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ప్రజల్లో ఆకాంక్ష ఉన్నప్పటికీ.. బయటకు వచ్చి.. దాన్ని పోరుబాట దిశగా అడుగులు వేయించిన ఘనత ఉస్మానియా విశ్వవిద్యాలయానికే జరుగుతుంది. అమరావతి ఉద్యమాన్ని ఏడు ఊళ్ల పంచాయితీగా చిన్నది చేసి చూపించేవారు..తెలంగాణ ఉద్యమం రగిలిన ఉస్మానియా క్యాంపస్ లో జరిగిన రచ్చ ఏడు ఎకరాల విస్తీర్ణం కంటే తక్కువ జాగాలోనే జరిగింది. కానీ.. తర్వాతి రోజుల్లో అదెలా మారింది.. ఎంతటి మార్పునకు కారణమైందన్న విషయం తెలిసిందే.

అమరావతి విషయానికి వస్తే.. దీనికి సంబంధించి జరిగిన విష ప్రచారం గురించి కాస్తంత చర్చించుకోవాల్సిందే. వెయ్యి రోజులకు పైనే అమరావతి కోసం ఉద్యమం జరుగుతున్నా.. ప్రచార మాధ్యమాల్లో దానికి లభించిన ప్రాధాన్యత తక్కువే. అంతేనా.. దీనిపై వచ్చిన వాదనల్లో నిజం ఏమిటి? అబద్ధమేమిటి? అన్న విషయాల మీద మీడియా వాస్తవాల్ని చెప్పే విషయంలో తప్పులు చేశారన్న విమర్శ కూడా ఉంది.

ఇంతకీ.. అమరావతి ఉద్యమాన్ని నీరసపరిచేలా జరిగిన విష ప్రచారాన్ని చూస్తే.. ఇంత భారీగా జరిగిందా? అన్న ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఇంత నెగిటివ్ ప్రచారంలోనూ వెయ్యి రోజుల పాటు అలుపెరగకుండా పోరాటం చేస్తున్న అమరావతి రైతుల్ని అభినందించాల్సిందే. తాజాగా అమరావతి నుంచి అరసవెల్లి వరకు సాగనున్న యాత్ర.. ఏపీ రాజధానిని ఏ రీతిలో ప్రభావితం చేస్తుందో చూడాలి.

రాజధాని అమరావతి మీద జరిగిన విష ప్రచారాన్ని చూస్తే..

-  అమరావతి ప్రజా రాజధాని' అన్న దానికి భిన్నంగా  'కాదు... అది కుల రాజధాని' అన్న ప్రచారం జరిగింది
-  అమరావతి దేవతల రాజధాని అన్న దానికి భిన్నంగా అది దెయ్యాల రాజధాని అనేందుకు వెనుకాడలేదు
-  అమరావతికి జేజేలు పలికిన నోటితోనే.. ఎడారి.. శ్మశానం.. కుల రాజధాని అన్న మరకలు
-  మూడు రాజధానుల కోసం సాగిన ప్రయత్నాలతో అమరావతి కోసం బలిదానం చేసినోళ్లు 214 మంది
-  రాజధానికోసం భూములు ఇచ్చిన రైతుల్లో 82 మంది మరణిస్తే.. 42 మంది రైతు కూలీలు ఉన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News