ఆత్మకూరు సాక్షిగా : అసెంబ్లీని రద్దు చేస్తారా...?

Update: 2022-05-30 10:30 GMT
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నిక జూన్ 23న జరగబోతోంది. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన ప్రకటన చేసింది. ఇపుడున్న పరిస్థితులలో  ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు అయితే సిద్ధంగా లేవు. కానీ బీజేపీ నుంచి అభ్యర్ధిని పోటీగా పెట్టాలని చూస్తున్నారు.

అదే కనుక జరిగితే జూన్ 23న ఎన్నిక ఉంటుంది. ఆ మీదట ఎటూ వైసీపీ గెలవడం లాంచనమే అవుతుంది. మెజారిటీ కూడా గతం కంటే కూడా ఎక్కువగానే వస్తుంది. ఎందుకంటే బీజేపీ పోటీ నామమాత్రంగానే ఉంటుంది. ఈ క్రమంలో లక్ష పై చిలుకు మెజారిటీని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో సాధించి అది తమకు ఉన్న బలంగా  జబ్బలు చరచి మరీ చెప్పుకోవాలని వైసీపీ భారీ స్కెచ్ గీస్తోంది.

ఎక్కడా జనాదరణలో తాము తగ్గలేదని, విపక్షాల మీద తమదే పై చేయి అని చెప్పుకుంటూ ఏపీలో పొలిటికల్ గా పాజిటివ్ ఎట్మాస్పెయిర్  ని క్రియేట్ చేయాలని వైసీపీ ఆలోచిస్తోంది. అలా ఆత్మకూరు ఉప ఎన్నిక విజయం కళ్ళ ముందు ఉంచుకుని అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెర తీయాలని వైసీపీ పెద్దల ప్లాన్ అని అంటున్నారు.  అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది నవంబర్లో అసెంబ్లీ రద్దు ఉంటుందని కూడా ప్రచారం సాగుతోంది.

అంటే జనాల్లో తమకు విశేష ఆదరణ ఉందని చెప్పుకుంటూ వైసీపీ  ఎన్నికల బరిలోకి దూకడం అన్న మాట. ఒక విధంగా ఇది విపక్షాలకు మింగుడుపడని వ్యవహారంగా చేయాలని చూస్తున్నారు. అదే టైమ్ లో ఏపీలో రాజకీయ  యాత్రల సీజన్ మొదలవుతున్న వేళ వాటికి అంత స్కొప్ ఇచ్చి  జనంలో బలపడకుండా చేసే ఎత్తుగడ అని అంటున్నారు.

ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ తో మంచి సంబంధాలు వైసీపీ కొనసాగిస్తున్నందువల్ల మధ్యంతర ఎన్నికలకు వెళ్ళినా తాము కోరుకున్న విధంగా తగిన సమయానికి ఎన్నికలు జరిపించుకోవచ్చు అన్న ధీమా కూడా వైసీపీ పెద్దలకు ఉంది అంటున్నారు. ఇక మహానాడుతో ఏపీలో పూర్తిగా రాజకీయ మార్పు వచ్చేసింది అని టీడీపీ చాటింపు వేసుకుంటోంది. దానికి ఆత్మకూరు ఉప ఎన్నికతోనే చెక్ పెట్టడానికి వైసీపీ సిద్ధపదుతోంది.

అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఆత్మకూరు కి ఉప ఎన్నిక జరిగితేనే వైసీపీ లక్ష మెజారిటీ అని జనాలకు చూపించగలదు. ఎన్నికలలో బీజేపీ పోటీ చేయకపోతే మాత్రం ఈ వ్యూహం బెడిసికొడుతుంది. ఏకగ్రీవం అయిన సీటు విషయంలో ఎవరికీ ఆసక్తి కూడా ఉండదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నిక జరిగి తీరాలని వైసీపీ చూస్తోందిట. దానికి తగినట్లుగా బీజేపీలో ఒక సెక్షన్ అయితే ఎన్నికలకు రెడీ అంటోంది.

అయితే మరికొందరు మాత్రం ఉప ఎన్నికల బరిలో దిగి వైసీపీకి ఈ కీలకమైన వేళ జనంలో బలం ఉందని చాటడమే అవుతుంది అంటున్నారుట. అయితే బీజేపీ హై కమాండ్ నిర్ణయమే చివరికి అమలు అవుతుంది కాబట్టి కమలనాధుల డెసిషన్ బట్టే వైసీపీ రాజకీయ ఆశలు ఆకాంక్షలు , భవిష్యత్తు ప్రణాళికలు ఆధారపడి ఉన్నాయని చెప్పకతప్పదు.
Tags:    

Similar News