నేతాజీ అలా మ‌ర‌ణించ‌లేదంటూ క‌న్ఫ‌ర్మ్ చేశాడు

Update: 2017-07-17 04:58 GMT
స్వాతంత్య్ర స‌మ‌ర‌యోథుడు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణంపై ఉన్న సందేహాలు అన్నిఇన్ని కావు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఆయ‌న మ‌ర‌ణంపై వినిపిస్తున్న భిన్న‌వాదులు చాలానే ఉన్నాయి. ఇటీవ‌ల ఆయ‌న మ‌ర‌ణంపై కేంద్రం సైతం విమాన ప్ర‌మాదంలోనే మ‌ర‌ణించిన‌ట్లుగా తేల్చింది. అయితే.. ఇప్పుడా వాద‌న‌లో అస్స‌లు నిజం లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు పారిస్ కు చెందిన ప‌రిశోధ‌కుడు.

నేతాజీ విమాన‌ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌లేద‌ని.. మారువేషంలో జీవించారంటూ చాలానే క‌థ‌నాలు ఉన్నాయి. వీటికి బ‌లం చేకూరేలా తాజాగా పారిస్ కు చెందిన జేబీబీ మోర్ అనే ప‌రిశోధ‌కుడు స‌రికొత్త వాదాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. నేతాజీ మ‌ర‌ణంపై పెద్ద ఎత్తున ప‌రిశోధ‌న చేసిన ఆయ‌న‌.. ఒక నివేదిక‌ను సిద్ధం చేశారు.

తాను వినిపిస్తున్న వాద‌న‌కు బ‌లం చేకూరేలా ఆయ‌న కొన్ని ఆధారాలు చూపించ‌టం గ‌మ‌నార్హం. ఫ్రాన్స్ గూఢ‌చ‌ర్య సంస్థ‌కు చెందిన ఒక నివేదిక ఆధారంగా చూపిస్తున్న ఆయ‌న 1947 డిసెంబ‌రు 11 లో త‌యారు చేసిన ఒక నివేదిక ప్ర‌కారం నేతాజీ .. ఇండో చైనా ప్రాంతం నుంచి పారిపోయార‌ని.. ఆ త‌ర్వాత ఆయ‌న ఎక్క‌డ ఉన్నార‌న్న విష‌యంపై స‌మాచారం లేద‌న్నారు.

బోస్ మృతికి సంబందించిన స‌మాచారం ఈ గూఢ‌చ‌ర్యం నివేదిక‌లో లేద‌న్నారు. జ‌పాన్ ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న తైపీలో 1945 ఆగ‌స్టు 18న జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణించిన‌ట్లుగా బ్రిట‌న్‌.. జ‌పాన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఫ్రాన్స్ మాత్రం ఈ ఉదంతంపై పెద‌వి విప్ప‌లేదు.

తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ నివేదిక ఇప్పుడు ప‌లు సందేహాల్ని రేకెత్తిస్తోంది. మ‌రో కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే 1940ల‌లో ఇండో చైనా ప్రాంతం ఫ్రాన్స్ వ‌ల‌స‌ల పాల‌న‌లోనే ఉంది. ఇప్ప‌టికే బోస్ మ‌ర‌ణంపై ఉన్న సందేహాల్ని మ‌రింత పెంచేలా తాజా వాద‌న ఉంద‌ని చెప్పొచ్చు. చూస్తుంటే.. క‌నుచూపు మేర బోస్ మ‌ర‌ణంపై ఉన్న అనుమానాల్ని నివృతి చేసేట‌ట్లుగా క‌నిపించ‌టం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News