చివరి రోజు వచ్చే వరకూ ఆగాల్సిందేనా కేసీఆర్

Update: 2021-06-19 03:17 GMT
తప్పనిసరిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అయినప్పుడు.. కాస్త ముందే తీసుకుంటే సరిపోతుంది కదా? అదేం సిత్రమో కానీ.. పక్కా ప్లానింగ్ అన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. లాక్ డౌన్ మీద తదుపరి నిర్ణయం ఏమిటన్నది తేల్చటానికి గడువు దగ్గరకు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేస్తారో ఒక పట్టాన అర్థం కాదు. ఆ మధ్యన రాష్ట్ర హైకోర్టు సైతం.. లాక్ డౌన్.. తదితర అంశాల మీద నిర్ణయం తీసుకునేందుకు చివరి రోజు వరకు ఎందుకు ఆగటం..? కాస్త ముందే నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది కదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.

అయినప్పటికి తీరు మారకపోవటం కేసీఆర్ కే సాధ్యమవుతుంది. మరో మూడు రోజుల్లో తాను హాజరయ్యే గ్రామసభకు భోజనాలకు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం మీద అన్నేసి సలహాలు.. సూచనలు ఇచ్చే కేసీఆర్.. రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేసే లాక్ డౌన్ వేళల అంశాల్ని లెక్క తేల్చే విషయంలో మాత్రం ఆఖరి నిమిషం వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవటం విశేషం. ప్రస్తుతం తెలంగాణలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్ డౌన్ ఎత్తేయటం.. ఆ సమయంలో అన్ని వాణిజ్య కార్యకలాపాల్ని అనుమతించటం తెలిసిందే. సినిమా థియేటర్లు.. బార్లు.. పబ్బులు లాంటి కొన్నింటికి తప్పించి.. మిగిలిన అన్ని వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి.

శనివారంతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. కొత్త మార్గదర్శకాలు ఏ తీరులో ఉండాలన్న విషయాన్ని చర్చించేందుకు ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సాయంత్రం ఆరుగంటల వరకు ఉన్న లాక్ డౌన్ పొడిగింపు రాత్రి 9 గంటల వరకు పొడిగిస్తారని చెబుతున్నారు.

అదే సమయంలో జనసమ్మర్ధం ఉండే థియేటర్లు.. పబ్బులు.. క్లబ్బులు.. బార్లు లాంటి వాటి మీద ఎప్పటిలానే మూసి ఉంచాలన్న యోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు. ఈ నెలాఖరు వరకు చూసి.. ఆ తర్వాత వీటి మీదా పరిమితులు ఎత్తేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా కేసుల నమోదు బాగా తగ్గిపోయినప్పటికి.. ఒకేసారి పరిమితులన్ని ఎత్తేస్తే.. కేసుల సంఖ్య పెరిగితే.. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావిస్తున్నారు. అందుకే.. దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా.. ఇలాంటి సమావేశాల్ని అత్యవసరంగా.. హడావుడిగా ఏర్పాటు చేసుకునే కన్నా.. కాస్త ముందుగా నిర్ణయిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News