ముద్రగడ మీద ముద్ర... ఆ పార్టీకే నష్టం... ?

Update: 2022-01-05 12:30 GMT
ముద్రగడ పద్మనాభం కాపులకు ఐకాన్. ఆయనను ఎవరూ ఏ వంకా పెట్టలేరు. అవినీతి లేని నేత. మచ్చలేని నాయకుడు. ఒక ఆశయం కోసం ఆయన మూడు దశాబ్దాల పాటు పోరాడుతున్నారు. ముద్రగడ కోరుకుంటే రాజకీయాల్లో ఉంటే ఈపాటికే ఎన్నో కీలకమైన పదవులు కూడా నిర్వహించేవారు. మరి అలాంటి ముద్రగడ కాపుల కోసం అంటూ తనకు తానుగా ఒక జాతి నాయకుడిగా మారిఒపోవడం ఆ సామాజికవర్గానికి మేలు చేసినా మిగిలిన వర్గాల వారు మాత్రం ఆయన అందరివాడుగా ఉండాలని కోరుకునేవారు.

ఇక ఇన్నాళ్ళకు ముద్రగడ మళ్లీ రాజకీయ తెర మీద దూకుడు చేయాలని చూస్తున్నారు. ఆయన ఈసారి కాపులతో పాటు బీసీలు, దళితులను కూడా కలుపుకుని పోవాలని చూస్తున్నారు. అణగారిన వర్గాలకు అధికారం అన్న నినాదంతో ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకురావాలనుకుంటున్నారు. మరి ముద్రగడ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయి అన్నది పక్కన పెడితే ముద్రగడ ఇంకా ఇలా ఒక లేఖ వదిలారో లేదో జనసేన నుంచి ఆయనకు కౌంటర్ వచ్చి పడింది.

జనసేన అధికార ప్రతినిధి హోదాలో కూసంపూడి శ్రీనివాస్ కౌంట‌ర్ లేఖ‌ను ఒకటి విడుదల చేశారు. కాపులు, ఇతర కులాల‌ పేర్లు ముద్రగడ ముందు పెట్టుకుని రాజకీయం చేయడాన్ని తప్పు పట్టారు. బహుజనులు, మెజారిటీ జనాభాకు అధికారం అని ఉద్యమించాలని ఆయన కోరుతున్నారు. అంతే కాదు, జనాభా పరంగా ఎక్కువ ఉన్నాం కాబట్టి అధికారం ఇవ్వండి అని కోరడంలో అర్ధం లేదని కూడా ముద్రగడ విధానాన్ని ఖండిస్తున్నారు. ఆ మాటకు వస్తే తక్కువ జనాభా కలిగిన బ్రాహ్మణ, వైశ్య, మైనారిటీలకు రాజ్యధికార హక్కులు ఉండవా అని నిలదీశారు.

ముద్రగడ తన లేఖలో ఎప్పటి నుంచో మనమంతా బానిసలుగా ఉన్నామని చెప్పడాన్ని కూడా శ్రీనివాస్ తప్పుపడుతున్నారు. మార్పు కోసం పోరాడే సైనికులను పట్టుకుని బానిసలుగా ముద్రగడ చెప్పడమేంటని కూడా గుస్సా అయ్యారు. కుల రహిత సమాజాన్ని నిర్మించడానికి అంతా చూడాలని, కులాల మధ్య‌ చిచ్చు పెట్టడం కాదని శ్రీనివాస్ కౌంటరేశారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ ఇబ్బందులలో ఉన్నపుడో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయినపుడో ముద్రగడ సడెన్ గా తెరమీదకు వస్తారని ఆయన చెప్పడం విశేషం. అంటే ముద్రగడ పార్టీ పెట్టక ముందే ఆయన‌ మీద వైసీపీ ముద్రను జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ వేయడం బట్టి చూస్తూంటే ముద్రగడ రాక వల్ల ఎవరికి నష్టం అన్న చర్చ సాగుతోంది.

కాపులకు ఐకాన్ గా ముద్రగడ ఉన్నా రాజకీయంగా ఆ స్పేస్ ని జనసేన తీసుకోవాలనుకుంటోంది. పైగా జనసేన టీడీపీతో కలసి ముందుకు వెళ్ళాలని చూస్తోంది. కానీ ముద్రగడ లేఖను చూస్తే ఆ రెండు కులాలు అంటూ కమ్మలను కూడా అధికారానికి దూరం చేయాలని పిలుపు ఇస్తున్నారు. దాంతో టీడీపీకి అక్కడే మండుతోంది అన్న మాట ఉంది. అదే విధంగా మూడవ పార్టీని తెర మీదకు తీసుకురావడం ద్వారా కాపుల ఓట్లలో చీలిక తెచ్చి జగన్ కి మరో అవకాశం దక్కేలా చేయడమే ముద్రగడ ఉద్దేశ్యమని జనసేనలో అనుమానాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

ముద్రగడ పార్టీ అనగానే తెలుగుదేశంలో కలవరం రేగుతోంది. ఇపుడు జనసేన కూడా అలాగే రియాక్ట్ కావడాన్ని చూస్తూంటే ఆయన్ని జగన్ మనిషిగా ముద్రవేయాలని చూస్తున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఇక కాపుల విషయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ వైపే అంతా మద్దతుగా నిలబడాలన్న ఆశలు కూడా జనసేనకు ఉన్నట్లుగా ఉన్నాయి. మరి కాపులకు ఐకాన్ గా ఉంటూ వారిని బీసీలలో చేర్పించాలని కోరిన ఉద్యమకారునిగా ముద్రగడ ప్రభావం ఆ సామాజికవర్గంలో ఉండదా అంటే జవాబు ఇపుడే చెప్పేది కాదని అంటున్నారు.

ఇక ముద్రగడ ఎపుడూ అధికారంలోని కులాలు అధికారం చేపట్టాలని డిమాండ్ చేస్తూంటే కొన్ని కులాలను నెత్తిన పెట్టుకుని మోయడం వల్ల ఎప్పటికీ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందని పండే అవుతుంది అని ముద్రగడ అనుచరులు అంటున్నారు. మొత్తానికి ముద్రగడ దూకుడు కానీ ఆయన బీసీ దళిత నినాదం కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు నచ్చడం లేదా అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Tags:    

Similar News