పండ‌గ పూట మిస్సింగ్ మిడిల్ రిలీజ్

Update: 2017-08-25 04:51 GMT
దేశ ప్ర‌జ‌ల ప‌ర్సుల్లోకి స‌రికొత్త నోటు వ‌చ్చి చేర‌నుంది. దేశ చ‌రిత్ర‌లో తొలిసారి రూ.200 నోటును ప్ర‌వేశ పెడుతున్నారు. పండుగ వేళ (వినాయ‌క‌చ‌వితి) రూ.200 నోటును మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. మ‌హాత్మాగాంధీ కొత్త సిరీస్ లో ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఉర్జిత్ ప‌టేల్ సంత‌కంతో కొత్త రూ.200 నోటు ముదురు ప‌సుపు వ‌ర్ణంలో ప్ర‌జ‌ల చేతికి రానుంది. నోటు ముందు భాగంలో జాతిపిత మ‌హాత్మాగాంధీ బొమ్మ‌తో.. వెనుక వైపు సాంచీ స్థూపంతో ఉన్న ఈ నోటు దేశ సంస్కృతి.. వార‌స‌త్వాన్ని ప్ర‌తిబింబించేలా రూపొందించారు.

ఇప్ప‌టివ‌ర‌కూ చెలామ‌ణిలో ఉన్న నోట్లలో వంద త‌ర్వాత రూ.500.. రూ.1000.. రూ.2000 నోట్లు మాత్ర‌మే ఉన్నాయి. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత రూ.వెయ్యి నోటు చెలామ‌ణిలో లేకుండా పోయింది. దీంతో రూ.100 త‌ర్వాత రూ.500.. రూ.2వేల నోటు మాత్ర‌మే ఉండ‌టంతో మ‌ధ్య‌లో చిల్ల‌ర స‌మ‌స్య తీర్చే క‌రెన్సీ నోటు మిస్ అయ్యింద‌న్న భావ‌న ఉండేది. మిస్సింగ్ మిడిల్ గా నిపుణులు అభివ‌ర్ణించే దాన్ని భ‌ర్తీ చేస్తూ రూ.200 నోటును ఈ రోజు నుంచి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకు రానున్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత చిల్ల‌ర నోట్ల స‌మ‌స్య ఎక్కువ‌గా ఉండ‌టం.. రూ.వంద నోటు త‌ర్వాత పెద్ద విలువ క‌లిగిన నోట్ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర‌మైన చిల్ల‌ర స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. దీన్ని కొత్త రూ.200 నోటు భ‌ర్తీ చేయ‌నుంది. ఇక‌.. కొత్త రూ.200 నోటు ఎలా ఉంద‌న్న విష‌యానికి వ‌స్తే.. ముదురు ప‌సుపు రంగులో ఉన్న ఈ నోటు ముందు భాగంలో కొట్టొచ్చేలా మ‌హాత్ముడి చిత్రాన్ని ముద్రించారు. దృష్టి లోపం ఉండే వారు సైతం తేలిగ్గా గుర్తు ప‌ట్టేలా కాస్త ఉబ్బెత్తుగా సిద్ధం చేశారు. అశోకుడి స్తంభం గుర్తునూ ముద్రించారు. రూ.200 అక్ష‌రాల్ని చిన్న చిన్న‌గా మ‌ధ్య‌లో ప్రింట్ చేశారు.

హెచ్ మార్క్ ను కుడి చేతివైపు ముద్రించారు. కింది భాగంలో రూ.200 గుర్తు ప‌చ్చ నుంచినీలం రంగుకు మారే సిరాతో ప్రింట్ చేశారు. నోటుపై వంపు తిరిగిన నాలుగు వ‌ర్ణాల గీత‌లు పార‌ద‌ర్శ‌కంగా క‌నిపిస్తున్నాయి. 66మిల్లీ మీట‌ర్ల పొడ‌వు.. 146 మిల్లీ మీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న ఈ నోటు మ‌ధ్య భాగంలో ప‌చ్చ నుంచి నీలం రంగులోకి మారే సిరాతో నిలువు గీత ఏర్పాటు చేశారు. దీనిపై భార‌త్‌.. ఆర్ బీఐ అని రాశారు. నోటు వెనుక భాగంలో సాంచి స్థూపం చిహ్నాన్ని.. దాని ప‌క్క‌నే స్వ‌చ్ఛ భార‌త్ నినాదాన్ని క‌నిపించేలా ప్రింట్ చేశారు.కొత్త నోటుపై ఉన్న ఇత‌ర డిజైన్లు జామెట్రిక్ పాట‌ర్న్స్ క‌ల‌ర్ డిజైన్ లో క‌లిసిపోయేట‌ట్లు ఉన్నాయి.

కొత్త నోటు ఎక్క‌డ దొర‌క‌నుంది? అన్న సందేహానికి స‌మాధానం వెతికితే.. శుక్ర‌వారం ఎంపిక చేసిన కొన్ని ఆర్ బీఐ శాఖ‌లు.. బ్యాంకుల ద్వారా రూ.200 నోట్ల‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఎటీఎంల‌లో రూ.200 నోటు ఇప్ప‌ట్లో రాక‌పోవ‌చ్చు. ఎందుకంటే ఈ నోటు సైజుకు స‌రిప‌డేలా ఏటీఎంల‌లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అందువ‌ల్ల క‌నీసం నెల‌ల వ్య‌వ‌ధి త‌ర్వాత మాత్ర‌మే ఈ కొత్త నోటు ఏటీఎంల‌లో రానుంది. న‌కిలీ నోట్ల బెడ‌ద‌కు చెక్ చెప్పేందుకు.. స‌గ‌టు ప్ర‌జ‌ల ఆర్థిక లావాదేవీలు స‌జావుగా జ‌రుపుకోవ‌టానికి వీలుగా కొత్త నోట్ల జారీ ఉంద‌ని చెప్పాలి.  తాజాగా విడుద‌ల చేస్తున్న రూ.200 నోటు పుణ్య‌మా అని మిస్సింగ్ మిడిల్ కొర‌త భ‌ర్తీ అయిన‌ట్లేన‌ని చెప్పొచ్చు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక కొత్త నోట్లు ఐదు వ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో వెయ్యి రూపాయిల నోటు ర‌ద్దు కాగా.. ఆ స్థానంలో రూ.2వేల నోటు వ‌చ్చింది. కొత్త రూ.500 నోటును ప్ర‌వేశ పెట్టింది. ఇప్పుడు తొలిసారి రూ.200 నోటు వ‌చ్చింది. కొత్త డిజైన్ తో రూ.50 నోటును.. రూ.1 నోటును తీసుకురానుంది. ఈ రెండు నోట్లు కానీ మార్కెట్లోకి మొత్తంగా ఐదు కొత్త నోట్ల‌ను మోడీ స‌ర్కారు తెచ్చిన‌ట్లు అవుతుంద‌ని చెప్పొచ్చు. 
Tags:    

Similar News