పీకే కాంగ్రెస్ జట్టు.. జగన్ ఎటు...?

Update: 2022-04-16 15:30 GMT
పీకే అంటే మళ్లీ చెప్పుకోవాలి. ఏపీ రాజకీయల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అనే పీకే కాదు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకే. ఆయన ఇప్పటిదాకా పోషించిన వ్యూహకర్త పాత్ర నుంచి రాజకీయ నేతగా మారుతున్నారు. లేటెస్ట్ గా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు.

కాంగ్రెస్ లో పీకే చేరిపోతారు అని అంటున్నారు. నిజానికి ఇది పాత వార్తే. నాడే కాంగ్రెస్ లో పీకే చేరాలి. కానీ ఆయన కోరుకున్న హోదా ఇవ్వడానికి సీనియర్ల నుంచి వ్యతిరేకత వచ్చినందువల్ల వెనక్కి తగ్గారు.

ఇపుడు మాత్రం అలా జరగదు అంటున్నారు. కాంగ్రెస్ కి పీకే వ్యూహాలు కావాలి. పీకేకి కాంగ్రెస్ లాంటి పార్టీ కావాలి. అందుకే ఆయన సోనియాతో భేటీ అయ్యారని తెలుస్తోంది. మొత్తానికి పీకే కాంగ్రెస్ లో చేరితే ఏపీలో జగన్ సంగతి ఏంటి అన్నదే ఇక్కడ చర్చ. జగన్ కి 2024 ఎన్నికల వేళ రాజకీయ వ్యూహాలకు పీకే పదును పెడుతున్నారు. ఆయన సలహా సూచనలతోనే ఏపీలో వైసీపీ రాజకీయం సాగుతోంది.

మరో వైపు చూస్తే పీకే కాంగ్రెస్ లో చేరితే ప్రతిపక్షాలను కూడా ఆ గూటికి చేర్చాల్సి ఉంటుంది. మమతా బెనర్జీ, కేసీయార్, స్టాలిన్  సహా అందరితో మంచి రిలేషన్స్ ఉన్న పీకే కి జగన్ తో మంచి దోస్తీ ఉంది. మరి జగన్ పీకే కాంగ్రెస్ లోకి వెళ్లాక ఆయనతోనే కలసి సాగుతారా. లేక కాంగ్రెస్ కి తనకూ దూరం కాబట్టి వేరే వ్యూహకర్తను చూసుకుంటారా అన్నది చూడాలి.

అయితే జగన్ ఇపుడు మారారు. రాజకీయంగా ఆయన వ్యూహాలు వేరేగా ఉంటున్నాయి అంటున్నారు. గతంలోలా నో కాంగ్రెస్ అనే సీన్ ఉండదు, బీజేపీని దారిలో పెట్టుకోవడానికి అయినా చంద్రబాబు మాదిరిగా కాంగ్రెస్ ఆప్షన్ ఉంచుకుంటారు అంటున్నారు.

మొత్తానికి రాష్ట్రపతి ఎన్నికల వేళకు ఈ సమీకరణలు మారకపోవచ్చు కానీ వచ్చే ఏడాది ఎన్నికల టైమ్ కి మాత్రం ఏపీలో రాజకీయం పూర్తిగా మారే సీన్ అయితే ఉంది. జగన్ ని తన దారికి, కాంగ్రెస్ దారికి తెచ్చే నేర్పు పీకేకు ఉందా అంటే చూడాలి మరి.
Tags:    

Similar News