వామ్మో.. కరోనా మరో కొత్త రూపమా..!

Update: 2021-07-08 23:30 GMT
కరోనా ప్రపంచాన్ని ప్రస్తుతం అతలాకుతలం చేస్తున్న వింత వ్యాధి. శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమించి కరోనాకు వ్యాక్సిన్ కనుగొంటే అది మాత్రం తెలివిగా తన రూపాలను మార్చుకుంటూ జనాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నా... కూడా ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ భయం, భయంగా బతికే పరిస్థితుల్ని తీసుకొస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొత్త రూపాల్లోకి ప్రవేశించి... మానవాళికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి తాజాగా మరో కొత్త రూపంలోకి ప్రవేశించింది.

ఈ కొత్త రూపానికి శాస్త్రవేత్తలు ఎప్పటి లాగానే అర్థం కాకుండా, పలకరాకుండా ఓ పేరును ఫిక్స్ చేశారు. లంబ్డా వేరియంట్ గా నామకరణం చేశారు. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ జనాలల్లో కొత్త కంగారును తీసుకొచ్చింది. ఎంతలా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా ఈ వేరియంట్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ నూతన వేరియంట్ పై పలు పరిశోధనలు చేసిన మలేషియా ఆరోగ్య మంత్రిత్వశాఖ జనాలందరికీ దిమ్మ తిరిగిపోయే విషయాలను చెప్పింది. ఒక్క సారి వాళ్లు చెప్పిన విషయాలను గమనిస్తే...

నిన్న మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్ ప్రమాదకరమని భావించారు ప్రజలు, శాస్త్రవేత్తలు. కానీ ప్రస్తుతం కనుగొన్న లంబ్డా వేరియంట్ అంతకన్నా డేంజర్ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే ఈ నూతన వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో అత్యధిక మంది మరణించడానికి కారణం కానుందట. పెరూలో ఈ లంబ్డా వేరియంట్ పుట్టినట్లు మలేషియా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వేరియంట్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించింది.

కాగా... పెరూలో మే, జూన్ మాసాల్లో వెలుగుచూసిన కరోనా కేసుల్లో ఈ నూతన వేరియంట్ ద్వారా దాదాపు 82 శాతం మందికి వచ్చి ఉంటుందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ మరింత షాకింగ్ విషయాన్ని తెలిపింది. అంతే కాకుండా చిలీ దేశంలో మే, జూన్ నెలల్లో పాజిటివ్ వచ్చిన వారిలో 31 శాతం మందికి పైగా ఈ లంబ్డా వేరియంట్ ఉందట.

ఇన్నాళ్లు డెల్టా వేరియంటే డేంజర్ గా భావించిన ప్రజలకు ఇది అంత కన్నా ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇలా రోజుకో నూతన రకంతో కరోనా కంగారు జనాల్లో మరింత పెరుగుతోంది. ఇలాగే ఈ విపత్తు కొనసాగితే కొన్ని రోజుల్లో భూమి మీద అనూహ్య మార్పులు సంభవించడం పక్కా అని కొంత మంది అంచనా వేస్తున్నారు. ఏదేమైనా తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
Tags:    

Similar News