4 నెలల తర్వాత కూడా చైనాలో ఇప్పటికి కరోనా కేసులు?

Update: 2020-04-04 04:15 GMT
ఎవరు అవునన్నా.. కాదన్నా.. కరోనాను కట్టడి చేయటంలో చైనా తర్వాతే ఎవరైనా. కఠిన ఆంక్షల్ని అమలు చేయటం ద్వారా వైరస్ పుట్టిల్లును సేవ్ చేసుకున్నారని చెప్పాలి. అమితమైన ఆంక్షల్ని విధించటం.. వూహాన్ లాంటి మహానగరం మొత్తం లాక్ డౌన్ వేళ.. నగర ప్రజలు బయటకు రాకుండా చేయటంలో సక్సెస్ అయ్యారు. దీంతో పోల్చినప్పుడు వివిధ దేశాల వారు ఈ విషయంలో చెందిన వైఫల్యంతో వారిప్పుడు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు. ఇందుకు ప్రపంచానికి పెద్దన్న అమెరికా సైతం మినహాయింపు కాదని చెప్పాలి.

డిసెంబరు చివరి వారంలో కరోనా కేసులు వెలుగు చూడగా.. దాని తీవ్రత మాత్రం జనవరి రెండో వారానికి ప్రపంచానికి అర్థమైంది. చైనాలో పరిస్థితి అంతకంతకూ గడ్డు పరిస్థితులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. మిగిలిన దేశాలు అలెర్ట్ అయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైరస్ వెలుగు చూసిన నాలుగు నెలల తర్వాత కూడా చైనాలో నేటికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం నమోదైన పాజిటివ్ కేసుల సంగతి చూస్తే.. చైనాలో 31 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో.. ఆ దేశంలో 81,620 కేసులు నమోదైనట్లుగా చెబుతున్నారు. ఇందులో 3322 మంది మరణించారు.

వైరస్ వెలుగు చూసిన నాలుగు నెలలకు సైతం కొత్త కేసులు నమోదు అవుతున్నప్పుడు.. మన పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న. కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతున్న వేళ.. కంట్రోల్ చేయటానికి వీలుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు అన్ని కార్యకలాపాల్ని నిలిపివేశారు. ఈ నెల 14 నాటికి కేంద్రం విధించిన లాక్ డౌన్ గడువు పూర్తి కానుంది. చైనా అనుభవాన్ని చూస్తున్నప్పుడు.. ఇరవై ఒక్కరోజుల గడువుతో మాయదారి వైరస్ ను అదుపులోకి తీసుకొచ్చే అవకాశం తక్కువన్న అభిప్రాయం కలుగక మానదు.

ఇప్పుడిప్పుడే కేసుల తీవ్రత పెరగటం ఒక ఎత్తు అయితే.. వివిధ దేశాల నుంచి భారత్ కు వచ్చిన వారందరి ప్రయాణాలు మొదలై 14 రోజులు పూర్తి అయిన నేపథ్యంలో.. రానున్న మూడు నాలుగు రోజుల్లో నమోదయ్యే కేసుల తీవ్రత ఫ్యూచర్ ఏమిటో తేల్చేస్తుందని చెబుతున్నారు. చైనా ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకున్న పక్షంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటం అంత తేలికైన విషయం కాదన్నది మర్చిపోకూడదు. నాలుగు నెలల తర్వాత కూడా కేసుల నమోదు అవుతున్నప్పుడు.. ఇరవై ఒక్కరోజుల లాక్ డౌన్ తో అంతా బాగా అయిపోయిందని ఫీల్ కావటం తప్పే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News