తేదీలు మార్చి మళ్లీ దీక్ష ప్రకటన?

Update: 2015-09-26 05:00 GMT
చిన్న అవకాశం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న జగన్ కు సీమాంధ్రుల మనసుల్ని కొల్లగొట్టే దారి దొరికింది. విభజన నేపథ్యంలో ప్రత్యేకహోదా కోసం వారు పెట్టుకున్న ఆశల్ని ఎవరూ పట్టించుకోవటం లేదని.. తమను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారన్న కోపంతో ఉన్నారన్న విషయాన్ని జగన్ అర్థం చేసుకున్నారు. సీమాంధ్రుల మనసుల్ని పట్టించుకోని సీమాంధ్ర నేతలకు భిన్నంగా తాను ఉన్నానని.. వారి కోసం.. వారి ఆశల కోసం తాను పోరాటం చేస్తానని.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తానన్న భావన కలిగేలా పావులు కదుపుతున్నారు.

శనివారం నుంచి గుంటూరులో ప్రారంభం కావాల్సిన ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కారు అనుమతి ఇవ్వకపోవటం.. ఆమరణ దీక్ష నిర్వహించేందుకు హైకోర్టు ససేమిరా అనటంతో.. వాయిదా వేసుకోవటం మినహా మరో మార్గం లేకపోయింది. ఈ నేపథ్యంలో జగన్ దీక్ష గురించి ఏపీలో జరుగుతున్న చర్చను నిశితంగా గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్.. దీక్ష విషయంలో వెనక్కి తగ్గకూడదని భావిస్తోంది.

అందుకే.. తాజాగా వాయిదా వేసుకున్న ప్రత్యేక హోదా దీక్షను మరోమారు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం డేట్లను ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది. ఏపీ ప్రత్యేక హోదా కోసం పదే పదే పోరాటం చేసిన వ్యక్తిగా తాను అవతరించాలని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకూ పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఆయన.. ప్రత్యేక హోదా విషయంలో పట్టు సడలించకూడదని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా.. ఈ నెల ఆరేడు తేదీల్లో దీక్ష ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా దీక్ష్ విషయంలో వెనక్కి తగ్గకూడదని పట్టుదలతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశంలో ఏపీ అధికారపక్షంపై అలుపెరగని పోరాటం చేయాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News