కియా కార్లతో కేసీఆర్ కు కొత్త కష్టం.. దుమ్ము దులిపేశాడుగా?

Update: 2021-06-15 12:30 GMT
అదనపు కలెక్టర్లకు పెద్ద పీట వేయటమే కాదు.. వారికి బ్రాండ్ న్యూ కియా కార్లను ఇచ్చిన  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కరోనా కాలంలో కొత్త కార్ల పంపిణీ చేయాల్సిన అవసరం ఉందా? అని మండిపడుతున్నారు. ఈ విమర్శల పర్వం ఇలా సాగుతుండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘కరోనా కష్టకాలంలో కొత్త కార్ల పంపిణీ ఏమిటి? ముఖ్యమంత్రి కేసీఆర్ కియా.. ఇన్నోవా మోటార్స్ కు డీలర్ గా మారారు’’ అంటూ మండిపడ్డారు. కియా కార్ల పంపిణీపై దులిపేసిన ఆయన.. మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిపించాలని..మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించాలన్నారు. ఒకవేళ నిబంధనలకు అనుగుణంగా ఉండి ఉంటే.. కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నట్లు? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తుల పైనా విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో కేసీఆర్ ఫాంహౌస్ మీద విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అంతేకాదు.. మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ కూడా వార్తల్లోకి వస్తోంది. గతంలో దీనిపై ఆరోపణలు వచ్చినా.. తర్వాత తగ్గాయి. తాజాగా మరోసారి వీటిపై విమర్శల తీవ్రత ఎక్కువ అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News