నేటి నుంచి కొత్త డీటీహెచ్ నియమాలు

Update: 2019-02-01 08:00 GMT
టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త నియమాలు, నిబంధనలు నేడు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవి చాలా కఠినంగా.. సరళంగా.. సమర్థవంతంగా ఉన్నాయి. ట్రాయ్ నిబంధనలతో డీటీహెచ్ సేవల్లో సమూల మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫిబ్రవరి 1 నుంచి డీటీహెచ్, కేబుల్ వినియోగదారులు తమకు నచ్చిన చానల్స్ ను మాత్రమే ఎంపిక చేసుకొని వాటికి మాత్రమే డబ్బులు చెల్లించే వీలును ట్రాయ్ కల్పిస్తోంది.

ట్రాయ్ నిబంధనల ప్రకారం రూ.130 రూపాయల ప్రాథమిక నెలసరి బిల్లుతో 100 చానల్స్ ను చూసే వీలు కల్పించింది.  అయితే దీనికి అదనంగా జీఎస్టీ 18శాతం వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా 100 చానల్స్ కు రూ.153 రూపాయలు వినియోగదారుడు చెల్లించాలి. ఈ బిల్లు దేశంలోని అందరూ ఆపరేటర్లు, డీటీహెచ్ కంపెనీలకు ట్రాయ్ వర్తింప చేసింది.

ప్రస్తుతం దేశంలో ఉన్న డిజిటల్ ఆపరేటర్లు ఎయిర్ టెల్, టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్, ఇతర కంపెనీలు ఖచ్చితంగా ఈ 153 రూపాయల ప్యాక్ ను అందించాలి. అయితే చాలా కంపెనీలు ముందుగానే వినియోగదారులకు ఇంకా తక్కువ ధరకు సులభతరంగా వివిధ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

100 చానల్స్ ప్రాథమిక ప్యాక్ కంటే ఎక్కువ చానెల్స్ కావాలనుకునే వినియోగదారులకు 25 చానెళ్లకు అదనంగా 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 18శాతం జీఎస్టీ ఈ స్లాట్లకు కూడా వర్తిస్తుంది. చానెల్ ధరలను ప్రసారకర్తలే నిర్ధేశిస్తాయి. వాటికి ట్రాయ్ అధికారికంగా ఆమోదిస్తుంది. అన్ని చానెల్ ధరలు ట్రాయ్ వెబ్ సైట్లో ఇవ్వబడ్డాయి.

అయితే ఇదివరకే పాత ప్యాక్ లు సంవత్సరానికి చేసుకున్న వారికి ఈ కొత్త రూల్స్ వర్తించవు. వారి పాత ప్యాక్ ప్రకారమే వారు సంవత్సరం మొత్తం చూసే వీలును ట్రాయ్ కల్పించింది. ఏవైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి వీలుగా ట్రాయ్ కాల్ సెంటర్ 0120-6898689 నంబర్ ను , das@trai.gov.in మెయిల్ ఐడీని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

    
    
    

Tags:    

Similar News