యూట్యూబ్ కొత్త ఫీచర్ తో అతిగాళ్లకు ఇట్టే చెక్

Update: 2022-05-20 03:29 GMT
డేటా వినియోగం దేశంలో ఎంతలా పెరిగిందన్న గణాంకాలు చాలు.. డిజిటల్ యుగంలో భారత్ ఎంతలా దూసుకెళుతుందో ఇట్టే అర్థమైపోతుంది. డేటా వినియోగంలో అత్యధిక భాగం వీడియో స్ట్రీమింగ్ కు కేటాయిస్తుంటే.. అందులో మెజార్టీ భాగం యూట్యూబ్ దే అన్న విషయం తెలిసిందే. యూట్యూబ్ వీడియోలతో వచ్చిన చిక్కేమంటే.. వీడియో కింద ఇచ్చే టైటిల్ లో అదిరేలా.. చూసినంతనే క్లిక్ చేసేలా థంబ్ నెయిల్స్ సిద్ధం చేయటం తెలిసిందే. అయితే.. టైటిల్ లో పేర్కొనే అంశాలకు.. అందులోని కంటెంట్ కు ఎక్కడా పోలిక ఉండని పరిస్థితి. మొత్తం వీడియో పదినిమిషాలు ఉంటే.. అందులో పనికి వచ్చే అంశం మాత్రం మహా అయితే 10 సెకన్ల నుంచి 20 సెకన్లు మాత్రమే.

దీని కోసం మొత్తం వీడియోను చూడాల్సిన పరిస్థితి. మరికొందరు అతిగాళ్ల కారణంగా.. టైటిల్ లో ఉన్న విషయానికి.. వీడియోలోని కంటెంట్ కు ఎక్కడా లింకు లేని రీతిలో ఉంటుంది. ఇలాంటి వీడియోల కారణంగా టైం వేస్టు కావటం తెలిసిందే.

ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా యూట్యూబ్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. "మోస్ట్ రీప్లేడ్" పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ కారణంగా..  ఎవరైనా చూడాలనుకుంటున్న వీడియో లో ఏ భాగాన్ని యూజర్లు ఎక్కువగా చూసి ఉంటారన్న విషయాన్ని చూపిస్తుంది. దీంతో.. సదరు యూజర్లు మొత్తం వీడియో చూడటం కారణంగా టైం వేస్టు అయ్యే కన్నా.. వారు చూడాల్సిన అంశాన్ని మాత్రమే చూసే వీలుంది.

అయితే.. ఈ ఫీచర్ యూట్యూబ్ ప్రీమియం చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. తాజాగా ఈ ఫీచర్ ను సాధారణ యూజర్లకు డెస్కు టాప్.. మొబైల్ వెర్షన్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. మరి.. యూజర్లకు ఈ ఫీచర్ ఉందన్న విషయం ఎలా తెలుస్తుందన్న ప్రశ్నకు  .. యూజర్లకు వీడియోలోని మోస్ట్ రీప్లేడ్ ఏమిటన్న విషయాన్ని తెలియజేసేలా వీడియో పక్కన ప్రొగ్రెసివ్ బార్ గ్రాఫ్ ఉంటుందంటున్నారు.

అందులో యూజర్లు ఎక్కువగా చూసిన వీడియోలోని బార్ గ్రాఫ్ ను పెద్దదిగా కనిపించేలా సిద్ధం చేశారు. దీంతో.. యూజర్లు సులువుగా వీడియోలో మోస్ట్ రీప్లేడ్ కంటెంట్ ను చూసే వీలుంది. ఇదే కాకుండా మరిన్ని ఫీచర్లను కూడా యూట్యూబ్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

అందులో ఒకటి.. ఏదైనా వీడియోను చూసిందే.. మళ్లీ మళ్లీ చూడాలనుకుంటే.. అందుకు అనువుగా ఉండేలా సింగిల్ లూప్ ఫీచర్ ను మెనూలో అందుబాటులో ఉంచనున్నారు. ఇలా.. మరిన్ని ఫీచర్లు త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. మొత్తానికి యూట్యూబ్ లో తమకు సౌలభ్యాన్ని కలిగించే ఫీచర్లు మరిన్ని అందుబాటులోకి రానున్నాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News