వైసీపీకి కొత్త ఇన్‌ చార్జ్‌ లు వ‌స్తున్నారు...

Update: 2019-10-19 08:01 GMT
ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లోనే పాల‌న ప‌రంగానే కాకుండా అటు పార్టీ ప‌రంగాను ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతోన్న సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పార్టీ ఓడిపోయిన 24 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌చ్చే ఎన్నిక‌లే టార్గెట్‌గా ఇప్ప‌టి నుంచే పక్కా ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని చోట్ల ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారిని త‌ప్పించి వారి స్థానాల్లో కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే పాల‌కొల్లు లో బాబ్జీ ని త‌ప్పించి క‌వురు శ్రీనివాస్‌ను కొత్త ఇన్‌చార్జ్‌ గా నియ‌మించారు. ఇక రాజ‌మండ్రి సిటీలో రౌతు సూర్య‌ప్ర‌కాశ్‌రావును త‌ప్పించి ఆ ప్లేస్‌ లో శికాకొళ‌పు శివ‌రామ‌సుబ్ర‌హ్మ‌ణ్యంను నియ‌మించారు. ఇక పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తోట వాణిని కాదని.. ఎన్నికల అనంతరం గతంలో ఇన్ ఛార్జ్ గా పనిచేసిన దవులూరి దొరబాబును పెద్దాపురం ఇంచార్జ్ గా నియమించిన సంగతి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం ఇన్‌చార్జ్ ని తప్పించారు. జ‌గ‌న్‌ తో పాటు జిల్లా కే చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చ‌ర్చించుకుని అద్దంకి నియోజక వర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ గా బాచిన కృష్ణ చైతన్యను ఎంపిక చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ బాచిన చెంచు గరటయ్య తరుపున ఆయన కుమారుడు కృష్ణచైతన్య కీలకంగా వ్యవహరించారు. ఎన్నిక‌ల్లో ఓడిన గ‌ర‌ట‌య్య వ‌యోఃభారంతో ఉండ‌డంతో ఆయ‌న‌కు బ‌దులుగా ఆయ‌న కుమారుడికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఇక అదే ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరులో ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు బ‌దులుగా రావి రామ‌నాథం పేరు విన‌ప‌డుతోంది. ఆయ‌న కూడా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ప‌రుచూరు వైసీపీ ఇన్‌చార్జ్‌ గా ఉన్నారు. ఇక రాజ‌మండ్రి రూర‌ల్‌లో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా ఓడుతోన్న ఆకుల వీర్రాజుకు బ‌దులుగా ఇటీవ‌ల పార్టీలో చేరిన ఆకుల స‌త్య‌నారాయ‌ణ పేరు విన‌ప‌డుతోంది. విజ‌య‌వాడ తూర్పులో బొప్ప‌న భ‌వ‌కుమార్‌కు బ‌దులుగా మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి పేరు విన‌ప‌డుతోంది. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండిలో సీవీఎల్‌.న‌ర‌సింహారాజుకు బ‌దులుగా మరొక‌రిని రంగంలోకి దింపాల‌నుకుంటున్నారు.
Tags:    

Similar News