టీఆర్ఎస్ వ్యతిరేకులతో కొత్త పార్టీ?

Update: 2021-04-04 10:38 GMT
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలను కలిసి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వారు ఒప్పుకుంటే కొత్త పార్టీ పెట్టే దిశగా ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ పర్యటనలో విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కొండా బీజేపీలో చేరేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తోందని.. అందుకే టీఆర్ఎస్ తరుఫున ఎంపీగా గెలిచినా పార్టీ మారానని కొండా తెలిపారు. కాంగ్రెస్ లో పోరాడే తత్వం లేదని.. అందుకే బయటకు వచ్చేశానన్నారు.

టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నింటిని ఒక్క తాటిపైకి తీసుకొస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కలిసి వస్తే కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమని.. తానొక్కడినే మాత్రం పార్టీ పెట్టలేనని స్పష్టం చేశారు.

ఇప్పటికే కోదండరాం, చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న, మహబూబ్ ఖాన్, దాసోజు శ్రావణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులను కలిశానని కొండా తెలిపారు. టీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఏకం కాని పక్షంలో తాను బీజేపీలో చేరుతానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.


Tags:    

Similar News